Telangana: ఇకపై ఫాంహౌస్ నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి.. కొత్త పాలసీకి సర్కార్ సిద్ధం..!

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఫాంహౌస్ నిర్మాణాలకు ప్రత్యేక విధానం తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటివరకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో అనియంత్రిత నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సమగ్ర ఫాంహౌస్ పాలసీ ద్వారా నియంత్రణతో పాటు ప్రణాళికాబద్ధ అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Telangana: ఇకపై ఫాంహౌస్ నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి.. కొత్త పాలసీకి సర్కార్ సిద్ధం..!
Special Policy For Farmhouse Constructions

Edited By:

Updated on: Feb 21, 2026 | 9:21 PM

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఫాంహౌస్ నిర్మాణాలకు ప్రత్యేక విధానం తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటివరకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో అనియంత్రిత నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సమగ్ర ఫాంహౌస్ పాలసీ ద్వారా నియంత్రణతో పాటు ప్రణాళికాబద్ధ అభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విధివిధానాలు, రుసుములు, అభివృద్ధి చార్జీలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జోన్ పరిమితులు లేకుండా, కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో కూడా ఫాంహౌస్‌లకు అనుమతులు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసిన తర్వాత తుది రూపు ఇవ్వనున్నారు అధికారులు. ఈ పాలసీ అమలుతో ప్రభుత్వానికి నిర్మాణ, అభివృద్ధి రుసుముల రూపంలో ఆదాయం పెరగనుంది.

కరోనా తర్వాత ఫాంహౌస్‌లపై మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆసక్తి పెరిగింది. నగర జీవన ఒత్తిడిని తగ్గించుకునేందుకు వీకెండ్ హోమ్స్‌గా ఫాంహౌస్‌లను కోరుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ప్రస్తుతం 100, 200 గజాల్లో కూడా ఫాంహౌస్‌ల పేరుతో నిర్మాణాలు జరగడం, గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేయడం వంటి అక్రమాలు విస్తరిస్తున్నాయి. అధికారిక అనుమతుల వ్యవస్థ స్పష్టంగా లేకపోవడంతో బిల్డర్లు ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాలైన మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, శంకర్‌పల్లి, కందుకూరు, ఘట్‌కేసర్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫాంహౌస్ లేఅవుట్లు వెలుస్తున్నాయి. అయితే చట్టపరంగా ఈ భూములు ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే పరిగణించబడుతున్నాయి.

కొత్త పాలసీ ప్రకారం కనిష్టంగా 1,200 చదరపు గజాల స్థలం ఉండాలి.

కనీసం 30 అడుగుల వెడల్పు రోడ్డు తప్పనిసరి.

మొత్తం స్థలంలో కేవలం 20 శాతం మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి అనుమతి.

1,200 గజాల్లో 240 గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ భవనం నిర్మించవచ్చు.

మిగిలిన భూమిని తోటలు, పండ్ల చెట్లు, కూరగాయల సాగుకు వినియోగించాలి.

భవనం ఎత్తు 6 మీటర్లకు మించకూడదు.

ఫాంహౌస్ నిర్మాణాలను చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలను అరికట్టడం, ఆదాయం పెంపు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి సాధనమే ఈ పాలసీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us