
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా మంజూరు చేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో3 లక్షల మందికి ఇళ్లను కేటాయించగా.. వాటిల్లో కొన్ని నిర్మాణం కూడా పూర్తై గృహప్రవేశాలు కూడా చేశారు. ఇక మరికొన్ని ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజలకు మాత్రమే ఇళ్లను కేటాయించగా.. రెండో విడతలో పట్టణాలు, సిటీలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి కూడా ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. నగరంలో నివాసం ఉంటున్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.
హైదరాబాద్‌లోని లబ్దిదారులకు వచ్చే నెలలో రానున్న ఉగాదికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పత్రాలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్దిదారుల జాబితా సిద్దమవ్వగా.. వచ్చే నెలలో ఎంపికైనవారికి మంజూరు పత్రాలు అందించనుంది. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలోని పేదలకు వీటిని కేటాయించనుంది. ఇప్పటికే ప్రాంతాల వారీగా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేశారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ఇందిరమ్మ పథకం కింద ఆర్ధిక సాయం చేయనున్నారు. కుటుంబ ఆదాయం, భూ యాజమాన్య పత్రాల ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 12 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 18 వేల మందిని అర్హులుగా గుర్తించారు. వారం రోజుల్లో వీరి దరఖాస్తులను మరోసారి పరిశీలించి రీ సర్వే చేయనున్నారు.
ఇక సొంత స్థలం లేని పేదలకు కూడా ఇళ్లను నిర్మించి ప్రభుత్వం కేటాయించనుంది. మురికివాడల్లో పేదలు ఉంటున్న ప్రాంతంలోనే 5 నుంచి 10 అంతస్తుల భవన సముదాయాలు నిర్మించి వారికి అందించనుంది. ఇప్పటికే అధికారులు స్థలాలను గుర్తించే పనికి శ్రీకారం చుట్టారు. ఇక నగరంలో మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయనున్నారు. దాదాపు 28 వేల మంది పేదలకు ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు అందనున్నాయి. అటు గృహలక్ష్మి పథకం లబ్దిదారులకు కూడా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరు చేయగా.. 2.50 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. మార్చి నాటికి ఈ ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది.