Telangana: వడదెబ్బ తగిలి చనిపోతే రూ.4 లక్షల పరిహారం.. ప్రభుత్వం నుంచి పొందే ఛాన్స్.. దరఖాస్తు విధానం ఇలా..

తెలంగాణలో మాడు పగిలే ఎండలు మొదలయ్యాయి. ఎండలు రోజురోజుకి దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడికి అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వడదెబ్బ కారణంగా మరణిస్తే.. కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తోంది. అవి ఎలా పొందాలి? అనేది చూద్దాం.

Telangana: వడదెబ్బ తగిలి చనిపోతే రూ.4 లక్షల పరిహారం.. ప్రభుత్వం నుంచి పొందే ఛాన్స్.. దరఖాస్తు విధానం ఇలా..
Money

Updated on: Mar 10, 2026 | 5:20 PM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పుడే ఎండాకాలం మొదలవ్వడంతో భానుడు తీవ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 10 గంటలకే మొదలవుతున్న భానుడి భగభగలు.. సాయంత్రం వరకు కొనసాగుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం ఆలోచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతలు గత కొద్దిరోజులుగా పెరుగుతుండగా… రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అలర్ట్ జారీ చేసింది. మార్చి చివరి నాటికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కబోతతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఇక వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వడదెబ్బ బారిన పడి మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. గతంలో బాధిత కుటుంబాలకు రూ.50 వేల సాయం అందించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిమితిని భారీగా పెంచారు. ఇక నుంచి వడదెబ్బ బారిన పడి ఎవరైనా మరణిస్తే.. వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతీ మండలంలో వడదెబ్బ మరణాలను ధృవీకరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఎమ్మార్వో, వైద్య అధికారి, ఎస్సై ఉంటారు. ఎవరైనా వడదెబ్బ కారణంతో మరణిస్తే ఈ కమిటీకి సమాచారం అందించాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ ఆ కారణంతోనే బాధితుడు మరణించినట్లు డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఇక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బ కారణంతోనే చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలాల్సి ఉంటుంది. పోస్ట్‌మార్టంలో వడదెబ్బ వల్లే చనిపోయినట్లు తేలితే పరిహారం అందుతుంది. ఈ పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ రిపోర్ట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, డెట్ సర్టిఫికేట్ అందించి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత త్రిసభ్య కమిటీ ధృవీకరించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. వాళ్లు పరిశీలించి బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తారు. కాగా తెలంగాణలో ప్రతీ ఏడాది వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Follow Us