
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. ఎన్నికల వేళ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ వాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కోట్లు పెట్టి వ్యాపారం చేసి రోజంతా కష్టపడినా.. ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఏకంగా తెలంగాణ ఎన్నికల అధికారులను కలిసి గోడు వెళ్ళబోసుకుంటున్నారు వ్యాపారులు. ఇంతకీ ఆ వ్యాపారులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అసలు ఆ వ్యాపారులు ఎవరు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. అప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడగడున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. అక్రమ మద్యం, డబ్బు తరలింపులపై నిఘా పెట్టారు. అక్రమ తరలింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా డబ్బు కానీ.. మద్యం కానీ సరఫరా చేయకుండా ఉండేందుకు ఈ చెక్‌పోస్టుల్లో.. లెక్క పత్రం లేని డబ్బు మద్యంను పోలీసు అధికారులు పట్టుకొని సీజ్ చేస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. పోలీస్ చెకింగ్‌లు, తనిఖీలకు భయపడి జనం మద్యం షాపుల ముఖం చూడటం లేదు. పైగా అక్రమంగా తరలిస్తున్న మద్యం దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తూ దుకాణాలనే సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తం 50కి పైగా వైన్స్ షాపులు మూతపడ్డాయి. దీంతో వ్యాపారులంతా తమ గోడు వెళ్ళబోసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. అక్రమంగా తరలించే వారిని పట్టుకోవాలని.. సక్రమంగా కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలోని వైన్స్ షాప్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.
వైన్స్ షాప్ యజమానులు ఎన్నికల కోడ్ అమలవుతున్నప్పటి నుండి తమకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 12వ తేదీ నుండి ఇప్పటి వరకు 56 వైన్ షాపులు సీజ్ చేశారని వివరించారు. కోట్ల రూపాయల పెట్టి వ్యాపారం చేసే వాళ్లను పోలీసులు దొంగల్లాగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాప్తిలో వచ్చి షాపుల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీఈఓకి పిర్యాదు చేశారు.
వ్యాపారానికి సంబంధించిన సొమ్మును రాత్రి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో అక్రమంగా డబ్బు తరలిస్తున్నారంటూ వేధిస్తున్నారని, వ్యాపారం చేసిన డబ్బులు సీజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నౌకరి నామా, షాప్ లైసెన్స్ చూపించిన వదలకుండా పోలీసులు రూఢిగా ప్రవర్తిస్తున్నారని అని సీఈఓ ముందు బాధను చెప్పుకున్నారు. ఇలాగే ఇబ్బందలకు గురిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపులను క్లోజ్ చేస్తామని హెచ్చరించారు వైన్ షాపుల యజమానులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..