Telangana Elections: ఉమ్మడి మెదక్‌లో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి గాలి అనిల్ కుమార్ రాజీనామా
తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు సన్నిహితులైన మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారంనాడు ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు సన్నిహితులైన మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు వారు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారంనాడు ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం. గాలి అనిల్ కుమార్ నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఆవుల రాజిరెడ్డికి కేటాయించింది. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది. ఆవుల రాజిరెడ్డిని మార్చాలంటూ గాలి అనిల్‌కుమార్ అనుచరులు ఆందోళనలు చేపట్టినా ఫలితం దక్కలేదు. ఆవుల రాజిరెడ్డి… బీఆర్‌ఎస్ కోవర్ట్ అని ఆరోపిస్తూ.. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్ధిని మార్చాల్సిందేనని పార్టీ అధిష్టానంపై గాలి అనిల్‌కుమార్ ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే అభ్యర్థిని మార్చేందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు.
పార్టీలో సరైన గౌరవం దక్కనందునే..
పార్టీలోని అన్ని పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డికి లేఖలు పంపారు. చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సరైన గౌరవం, ప్రాధాన్యత దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సొంత డబ్బులతో పార్టీ కోసం పనిచేసినట్లు చెప్పారు. పార్టీ టికెట్ ఇస్తామని చెప్పినందునే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి.. గత ఐదేళ్లుగా పార్టీ నిర్మాణం కోసం పనిచేసినట్లు తెలిపారు. ఇప్పుడు తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనను చిన్నచూపు చూసిందని ఆరోపించారు. కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై తన సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
గాలి అనిల్ కుమార్ రాజీనామా లేఖ..
నర్సాపూర్‌లో జోరుగా ప్రచారం..
నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి సునితా లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డిని ఢీకొంటున్నారు. బీజేపీ నుంచి ఎర్రగొల్ల మురళీ యాదవ్ బరిలో ఉన్నారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో సునితా లక్ష్మా రెడ్డి(కాంగ్రెస్) ఇక్కడి నుంచి విజయం సాధించగా.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మదన్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో సునితా లక్ష్మా రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..