హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే మహిళలకు వాషింగ్ మెషీన్లు, సెల్‌ఫోన్స్ అందిస్తామని ఒక పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బహుజన్ సమాజ్ పార్టీ – బీఎస్‌పీ తాజాగా 10 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలిచ్చిన హామీలకు మరిన్ని జతచేర్చి 10 ఆకర్షణీయ పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడదల చేశారు. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి పథకం కింద మహిళ కార్మికులు, రైతులకు ఉచితంగా వాషింగ్ మెషీన్, స్మార్ట్‌ఫోన్‌తో పాటు డ్రైవింగ్‌లోనూ శిక్షణ అందిస్తామని బీఎస్‌పీ ప్రకటించింది.
ఫూలే విద్యా దీవెన పథకం కింద ప్రతీ మండంలో ఒక అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే ప్రతీ మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యకు సాయం అందించడంతో పాటు డేటా, AI, కోడింగ్‌లో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. కాన్షీ యువసర్కారు పథకం కింద ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీఎస్‌పీ భరోసా ఇచ్చింది. ఇందులో సగం కొలువులు మహిళలకే కేటాయిస్తామని మాట ఇచ్చింది. దొడ్డి కొమురమయ్య భూమి హక్కు పథకం కింద భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ పట్టాల మహిళల పేరు మీదే ఉంటాయని తెలిపింది. ఇల్లు లేని వారి కోసం షేక్ బందగీ గృహ భరోసా పథకం తీసుకొస్తామని బీఎస్‌పీ వెల్లడించింది. నూరేళ్లు ఆరోగ్య ధీమా పథకాన్ని తీసుకొచ్చి ప్రతీ కుటుంబానికి 15 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం అందిస్తామని తెలిపింది.