నిన్నటి దాకా వాళ్లంతా మంత్రులు. ఓటమి ఎరుగని ధీరులు. ఇప్పుడు కాంగ్రెస్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఒకళ్లు కాదు ఇద్దరు కాదు…ఏకంగా పలువురు మంత్రులు పరాజయం పాలయ్యారు.
తెలంగాణ దంగల్‌లో పలువురు బీఆర్‌ఎస్ మంత్రులు మట్టి కరిచారు. కాంగ్రెస్ సునామీలో గులాబీ కోటలు కూలిపోవడంతో పాటు గులాబీ మంత్రులు కూడా పరాజయం పాలయ్యారు. పలువురు మంత్రుల అడ్రస్ గల్లంతయింది. దశాబ్దాల నుంచి గెలుస్తున్న సీనియర్ నేతలు సైతం ఓడిపోయారు. కొందరైతే యువ నేతల చేతుల్లో పరాజయాన్ని చవిచూశారు. ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగని ధీరుడు, పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈసారి మాత్రం పాలకుర్తిలో ఓడిపోయారు. గతంలో టీడీపీలో, ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి, యువ నాయకురాలు యశస్విని రెడ్డి గెలిచారు. ఇక, 2004 నుంచి గులాబీ పార్టీ తరఫున… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలిచారు.
ఇక ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగి, మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటు నుంచి గెలుస్తూ వచ్చిన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి యేలేటి మహేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. మరోవైపు ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై సీనియర్ నేత, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి చేతిలో ఆర్ అండ్ బీ మంత్రి నిరంజన్ రెడ్డి ఓటమి చవి చూశారు.
కాంగ్రెస్ గాలికి మంత్రులు కూడా పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికలు గులాబీ పార్టీతో పాటు మంత్రులకు కూడా భారీ షాక్ ఇచ్చాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :