ఆగమాగం కావొద్దు.. కాంగ్రెస్ నేతలు చెప్పే మాయమాటలు నమ్మొద్దంటూ.. ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ అభ్యర్ధులను గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణకు మోసం చేసిందే కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదని… ఆ పార్టీని తెలంగాణలో బొంద పెడతారనుకున్నప్పుడే రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు సీఎం కేసీఆర్.
సుడిగాలి పర్యటనతో సీఎం కేసీఆర్.. మరోసారి కాంగ్రెస్ పై విమర్శల దాడి చేశారు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. కాంగ్రెసోళ్లు పదవులు వస్తే సంబరపడి, ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు. స్వరాష్ట్రం తెలంగాణలో మూడోసారి ఎన్నికలొస్తే డజన్ మంది కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం పోటీ పడుతున్నారని విమర్శించారు. అసలు కాంగ్రెసే గెలిచే పరిస్థితి లేదని, ఇంకా సీఎం లు ఏడికెల్లి అయితరని ఎద్దేవా చేశారు కేసీఆర్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్, మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రైతు బంధుకి సర్వత్రా హర్షాతిరేకాలు వస్తుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం నచ్చడంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. నాగలి దున్నని రాహుల్ గాంధీ, ధరణిని తీసేయాలని అంటుండని విరుచుకు పడ్డారు. ధరణి లాంటి మంచి పథకం ఉంచుకుంటారో పోగొట్టుకుంటారో ఆలోచించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
మాట్లాడితే గడ్డం తీయనని శపధాలు చేస్తున్న ఉత్తమ్, కావాల్సింది ప్రజలకు అభివృద్ధి కావాలని అన్నారు. గాలి గత్తరలో కొట్టుకుపోకుండా ఆలోచించి ఓటు వేస్తేనే ప్రజలు గెలిస్తరని, నిజ నిజాలు తేల్చుకుని ఓటు వేయాలని కోరారు గులాబీ బాస్. పోటీ చేసే పార్టీల చరిత్ర , దృక్పధం, ఫిలాసఫీ ఏంటో ప్రజలు చర్చించాలని అన్నారు. తండాల్లో మా రాజ్యమని గిరిజనులు కొట్లాడినా ఎవరు చేయలేదని అన్నారు. ఎన్నికలు వస్తే గోలమాల్ చేసి గోకర్ణ టక్కుటమారాలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర భవిత ఆలోచించి యువత సరైన నిర్ణయంతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ కట్టాల్సిన చోట కట్టకుండా మరోచోట కడితే ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకున్నారని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఉన్నది మాట్లాడితే ఉత్తమ్ ఎగిరిపడుతుండని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..