Telangana Election: తెలంగాణను రౌండప్ చేస్తున్న జాతీయ నేతలు.. మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోనే మోదీ మకాం

|

Nov 23, 2023 | 8:36 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడంతో ప్రచార పర్వంలో పొలిటికల్ పార్టీలు స్పీడు పెంచాయి. అగ్రనేతలు అందరిని రంగంలోకి దింపుతున్నాయి జాతీయ పార్టీలు. మిషన్ తెలంగాణ పేరుతో దక్షిణాది మీద స్పెషల్‌గా ఫోకస్ చేసిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ నుంచి హేమా హేమీలను రప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలి విడత టూర్లతో గేరు మార్చబోతోంది కమలం పార్టీ.

Telangana Election: తెలంగాణను రౌండప్ చేస్తున్న జాతీయ నేతలు.. మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోనే మోదీ మకాం
Modi ,amit Shah , Nadda
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడంతో ప్రచార పర్వంలో పొలిటికల్ పార్టీలు స్పీడు పెంచాయి. అగ్రనేతలు అందరిని రంగంలోకి దింపుతున్నాయి జాతీయ పార్టీలు. మిషన్ తెలంగాణ పేరుతో దక్షిణాది మీద స్పెషల్‌గా ఫోకస్ చేసిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ నుంచి హేమా హేమీలను రప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలి విడత టూర్లతో గేరు మార్చబోతోంది కమలం పార్టీ. అంతకంటే స్పెషల్ ఏంటంటే.. నవంబర్ 24 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడే మకాం పెట్టబోతున్నారు ప్రధాని మోదీ.

‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది కమలం పార్టీ. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతలను రప్పించి విజయ సంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది బీజేపీ. గురువారమే తెలంగాణకు వచ్చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్మూర్‌లో జరిగే విజయసంకల్ప సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు.

ఎన్నికల ప్రచారం చివరి రోజైన నవంబర్ 28న మరోసారి రాష్ట్రానికి వస్తారు అమిత్ షా. ఒకేరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 28వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడినుంచి నేరుగా మంచిర్యాలకు వెళతారు. మధ్యాహ్నం 2 నుంచి 2.45 వరకు పెద్దపల్లిలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. 3.15 నుంచి 4గంటల వరకు హుజూరాబాద్ బహిరంగసభలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ నుంచి డిల్లీకి తిరుగు పయనమవుతారు అమిత్‌షా.

ఇదిలా ఉంటే… ఈ శనివారం హైదరాబాద్‌కి రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మూడు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేస్తారు. నవంబర్ 25న కామారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గాలు, 26వ తేదీన దుబ్బాక, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. 25వ తేదీ రాత్రికి హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో బస చేస్తారు. 26న రాత్రికి తిరుపతి చేరుకుని, 27 ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. నవంబర్ 27 సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తెలంగాణా ఎలక్షన్ టూర్ కంప్లీటౌతుంది.

అమిత్‌షా, మోదీలతో పాటు ముగ్గురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణలో పర్యటిస్తారు. ఇలా సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా ఢిల్లీ నేతలతో తెలంగాణ గల్లీల్ని హోరెత్తించాలన్నది బీజేపీ ప్రచార ఎత్తుగడ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…