విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ముగ్గురు పోలీసులు.. ఒక్కో ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం అందజేత!

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరుల కుటుంబాలకు తెలంగాణ పోలీస్ శాఖ కొండంత అండగా నిలిచింది. కర్తవ్య పాలనలో అసువులు బాసిన ముగ్గురు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల విలువైన ఎస్‌బీఐ బీమా పరిహార చెక్కులను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా అందజేసి, వారిక పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే భరోసానిచ్చారు.

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ముగ్గురు పోలీసులు.. ఒక్కో ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం అందజేత!
Police Families Compensation

Edited By:

Updated on: Aug 31, 2026 | 8:02 PM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ అండగా నిలిచారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల బీమా పరిహారాన్ని అందజేశారు. సోమవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను డీజీపీ అందించారు.

శంకర్‌పల్లి పరిధిలో 2025 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ముత్తంగి శ్రీనివాస్‌ మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్‌ కుటుంబానికి ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌ పథకం ద్వారా రూ.కోటి పరిహారం లభించింది. శ్రీనివాస్‌ తండ్రి ముత్తంగి యాదయ్యకు డీజీపీ సీవీ ఆనంద్‌ బీమా చెక్కును అందజేశారు.

అలాగే నల్లగొండ జిల్లా కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్‌కు చెందిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బోలెపల్లి సైదులు 2025 జూన్‌ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మరో పోలీసు కానిస్టేబుల్‌ కె. వెంకటరెడ్డి కూడా విధి నిర్వహణలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. 2026 మార్చి 10న వరంగల్‌లోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో వెంకటరెడ్డి మృతి చెందారు.

మృతులందరికీ ఎస్‌బీఐలో ఇన్సూరెన్స్‌ అకౌంట్లు ఉండటంతో.. పోలీసుశాఖ అధికారులు బ్యాంకు అధికారులతో సంప్రదించారు. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున బీమా పరిహారం మంజూరైంది. ఈ మేరకు ముగ్గురు మృత పోలీసు సిబ్బంది కుటుంబాలకు మొత్తం రూ.3 కోట్ల బీమా చెక్కులను డీజీపీ సీవీ ఆనంద్‌ అందజేశారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబాల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీజీపీతో పాటు ఎస్‌బీఐ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us