ఇన్వెస్ట్ తెలంగాణ 2026: డిఫెన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సహకారం కోరిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, డిఫెన్స్ ఎక్స్‌పోకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్‌పో ఏర్పాట్లు, డీఆర్‌డీఓ భాగస్వామ్యం, ఆదిలాబాద్ విమానాశ్రయం, దేవరకద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టులకు భూకేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగ ప్రదర్శనకు కేంద్ర సహకారం కోరారు.

ఇన్వెస్ట్ తెలంగాణ 2026: డిఫెన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సహకారం కోరిన రేవంత్ రెడ్డి
Revanth Reddy Rajnath Singh Meeting

Edited By:

Updated on: Sep 02, 2026 | 4:34 PM

తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సులో భాగంగా నిర్వహించనున్న రక్షణ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాల్సిందిగా కోరారు. ఢిల్లీలో బుధవారం రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై చర్చించారు.

అంతర్జాతీయ స్థాయిలో రక్షణ ఎక్స్‌పో

రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శనతో పాటు భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ సంస్థలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్వయంగా హాజరై మార్గనిర్దేశం చేస్తే పాల్గొనేవారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సూర్యకిరణ్, సారంగ్ బృందాల ప్రదర్శనకు విజ్ఞప్తి

రక్షణ ఎక్స్‌పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని సీఎం కోరారు. ఎయిర్‌షో కోసం అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని కోరిన సీఎం.. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ప్రదర్శించాలని సూచించారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

DRDO, రక్షణ రంగ సంస్థలకు ఆహ్వానం

హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలతో పాటు డీఆర్‌డీవోకు చెందిన ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొనేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇది కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రతినిధులతో సమావేశాలకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు

ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. రక్షణ శాఖ మొత్తం 1,500 ఎకరాలు కోరిన నేపథ్యంలో మరో 750 ఎకరాలను సేకరించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు.

దేవరకద్రలో DRDL ప్రాజెక్టుకు 416 ఎకరాలు

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే అంగీకరించిందని సీఎం తెలిపారు. మొత్తం భూమికి ఏడాదికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల పాటు భూమిని కేటాయించనున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రెండు సార్లు లీజు కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు.

సమావేశంలో పలువురు నేతలు

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us