బీజేపీ – టీఆర్‌ఎస్‌లు మిత్రపక్షాలే, వారి ప్రయాణం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ : మానిక్కం ఠాకూర్

|

Feb 08, 2021 | 6:17 AM

ఖమ్మం కార్పొరేషన్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలోని సీక్వెల్‌ సమావేశ మందిరంలో ఖమ్మం కాంగ్రెస్ నగర స్థాయి బూత్‌ కమిటీలు, డివిజన్‌ కమిటీల సమావేశం ఆదివారం జరిగింది.

బీజేపీ - టీఆర్‌ఎస్‌లు మిత్రపక్షాలే,   వారి ప్రయాణం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ : మానిక్కం ఠాకూర్
Follow us on

ఖమ్మం కార్పొరేషన్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలోని సీక్వెల్‌ సమావేశ మందిరంలో ఖమ్మం కాంగ్రెస్ నగర స్థాయి బూత్‌ కమిటీలు, డివిజన్‌ కమిటీల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కంఠాకూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కేంద్రమాజీమంత్రులు రేణుకాచౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీల తీరుపై మండిపడ్డారు.

రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ కుటుంబంపై విచారణ జరిపిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌ పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మిత్రపక్షాలేనని, వారి ప్రయాణం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నచందంగా సాగుతోందని ఠాకూర్ విమర్శించారు. తాను భద్రాద్రి రాముని సాక్షిగా చెబుతున్నానని, సిద్ధాంతపరంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వబోమని, పార్టీ గుర్తుపై గెలిచి ద్రోహం చేసిన వారిని తిరిగి ఎట్టిపరిస్థితుల్లో రానివ్వమని ప్రకటించారు.

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారుల చిట్టా సిద్ధంచేస్తున్నామని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు . పువ్వాడ అజయ్‌కుమార్‌మంత్రి అన్న అహంకారంతో జిల్లాలో కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

బ్రిటీష్‌ పాలకులపై పోరాడిన చరిత్ర కాంగ్రెస్‌దని, ఆ స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తెచ్చే వరకూడా ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి మాట్లాడుతూ ఖమ్మంజిల్లా కాంగ్రెస్‌ ఖిల్లా అని అధికార పార్టీపై పోరాడి గెలుపును సొంతం చేసుకునే సత్తా జిల్లా నాయకులు, కార్యకర్తలకు ఉందన్నారు. చిన్న చిన్నతారతమ్యాలున్నా అందరూ కలిసికట్టుగా పనిచేసే స్ఫూర్తి ఉందని చెప్పుకొచ్చారు. ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌గాంధీ తిరిగి చేపట్టాలని రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీ : నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉండి, ఉన్నఫళంగా స్పీడు పెంచిన వైసీపీ నేతలు