Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ సర్వే రిపోర్ట్ టెన్షన్ పెట్టిస్తోందట. ఇంతకీ, ఆ రిపోర్ట్ ఏంటి? అంతలా భయపడే అంశాలు అందులో ఏమున్నాయ్? ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసితో ముందుకెళ్తోన్న టీకాంగ్రెస్‌కు ఓ రిపోర్ట్ ముచ్చెమటలు పట్టిస్తోందట. కాంగ్రెస్‌కు విజయావకాశాలు మెరుగుపడుతోన్నవేళ వైఎస్ షర్మిల పార్టీ అడ్డంకిగా మారబోతుందనే షాకింగ్ రిపోర్ట్ ఇప్పుడు టీపీసీసీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అంటున్నారు.
షర్మిల పార్టీతో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఊహించని నష్టం జరగబోతోందనే రిపోర్ట్ ఇచ్చారట వ్యూహకర్త సునీల్. ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండటం, వాళ్లంతా ఇప్పుడు షర్మిల వైపు చూస్తున్నారని సర్వేలో తేలిందట. అంతేకాదు, రెడ్డి ఓట్లు, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కూడా వైఎస్సార్టీపీకే వెళ్లే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారట సునీల్. ప్రతి నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లు చీల్చబోతోంది షర్మిల పార్టీ. షర్మిలతోపాటు విజయమ్మ, తెలంగాణ జిల్లాల్లో తిరిగితే కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినడం ఖాయమని తేల్చడంతో తలలు పట్టుకుంటున్నారట టీకాంగ్రెస్ లీడర్స్.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో సమావేశమైన ఠాగూర్ అండ్ బోసురాజు.. సునీల్ రిపోర్ట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ అభిమానులు, క్రిస్టియన్ మైనారిటీ అండ్ రెడ్డి ఓటర్లు షర్మిల పార్టీ వైపు వెళ్లకుండా గట్టిగా ఫోకస్ పెట్టాలని ఆదేశించారట. 2023లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసితో ముందుకెళ్తోన్న టీకాంగ్రెస్, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. అందుకే, పొత్తు అంశం కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అది హైకమాండ్ పరిధిలో ఉండటంతో ఆ బాధ్యతలను ఠాగూర్‌కి అప్పగించినట్లు సమాచారం. మరి, షర్మిల ఫీవర్ నుంచి టీకాంగ్రెస్ ఎలా గట్టెక్కుతుందో? హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.