
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి స్పెషల్ జీవోలు తీసుకొచ్చి ఎన్నికలకు సిద్ధమైంది. అటు ఎన్నికల సంఘం సైతం షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంతా ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిన వేళ హైకోర్టు ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. రిజర్వేషన్లను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఏ విధంగా ముందుగా సాగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న మార్గాలేంటీ అనే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టులో పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది.
కాగా పాత విధానంలో స్థానిక ఎన్నికలకు అడ్డంకులేవీ లేవని హైకోర్టు తెలిపింది. ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చని చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోవడం లేదన్న న్యాయస్థానం.. రిజర్వేషన్ల50శాతం పరిమితిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలోజీవోలు 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాత విధానంలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 25శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..