Praja Sangramam Yatra: టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలు 2023..! ప్రజా సంగ్రామ యాత్రతో సమరానికి బండి సంజయ్ శ్రీకారం

ఇప్పుడప్పుడే తెలంగాణలో ఎన్నికలు లేవు, అయితేనేం ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామయాత్రతో సమరశంఖం పూరిస్తున్నట్లు ప్రకటించింది.

Praja Sangramam Yatra: టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలు 2023..! ప్రజా సంగ్రామ యాత్రతో సమరానికి బండి సంజయ్ శ్రీకారం
Bandi Sanjay

Updated on: Aug 28, 2021 | 4:21 PM

Bandi Sanjay Praja Sangramam Yatra: ఇప్పుడప్పుడే తెలంగాణలో ఎన్నికలు లేవు, అయితేనేం ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామయాత్రతో సమరశంఖం పూరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా చార్మినార్ చేరుకున్న బండి సంజయ్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

టార్గెట్ 2023..! రాబోయే ఎన్నికలే లక్ష్యం! పాదయాత్రోనే శ్రీకారం. ప్రజా సంగ్రామ యాత్రతో సమరానికి సై అంటోంది బీజేపీ. ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కలిగించేందుకే యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రను రాష్ట్ర నేతలతోపాటు.. హైకమాండ్‌ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుతగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేశారు. మొదట బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు..అనంతరం నేతలంతా ర్యాలీగా ఛార్మినార్ వచ్చారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమరశంఖం పూరించారు. అనంతరం భారీ సభ నిర్వహించారు.

తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. పాదయాత్రతో తెలంగాణలో సునామీని సృష్టించబోతున్నామన్నామని బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీ జెండా ఎగిరేవరకు ప్రతికార్యకర్త కష్టపడాలని సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజూరాబాద్‌లో ఎన్నికుట్రలు చేసిన ఎగిరేది బీజేపీ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. కుటుంబ పాల‌నను పక్కన పెట్టి తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలకబోతున్నారన్నారు. పాతబస్తీ అభివృద్ధిని ఎంఐఎం, టీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయన్నారు. పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎందుకు తీసుకురావటంలేదో చెప్పాలన్నారు. ఏడేళ్ళుగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారన్నారు.

బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్‌ జెండా ఊపి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. ప్రతి రోజు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండేలా ప్రణాళికలు రూపొందిచారు. సంజయ్‌ వెంట దాదాపు 2,500 మంది కార్యకర్తలు ఉంటున్నారు.అటు పార్టీ తరపున ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్‌లు కూడా స్పెషల్‌గాఫోకస్ చేస్తున్నాయి. ఏయే వర్గాల ప్రజలను కలవాలి? ఏయే అంశాలపై మాట్లాడాలని అన్న అజెండాను ఖరారు చేస్తున్నాయి.


Read Also…. Revanth Reddy vs Mallareddy: నేను పాలు, పూలు అమ్మి ఎదిగా.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగాడో చెప్పాలన్న మంత్రి మల్లారెడ్డి
Good News: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో దేశమంతా తిరిగేయవచ్చు..!