న్యాయం కోసం పోరాడుతోన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు ( MLa Raghunandan Rao)పై కేసులు పెట్టడంపై బీజేపీ నాయకులు స్పందించారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రభుత్వ చర్యలను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ దోషులను అరెస్ట్ చేయడంపట్ల ఉంటే బాధితులకు న్యాయం జరిగేదన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని విమర్శించారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనమేనని మండిపడ్డారు. నేరాలను అరికట్టడంలో తామే నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని బండి సంజయ్ ప్రశ్నించారు.
డీకే అరుణ విమర్శలు..
బీజేపీ నాయకుడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేయడం పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం పై మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు డీకే అరుణ. జూబిలీ హిల్స్ లో మైనర్ బాలికపై హత్యాచారం చేసిన టీఆర్ఎష్, ఎంఐఎం నాయకులకు సంబంధించిన వారిని కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో అసలు నిజాలను సాక్షాలతో పాటు వెలుగులోకి తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసులు కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని డీకే అరుణ మండ్డిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పై హత్యచారాలు జరుగుతుంటే వాటిని నియంత్రించాల్సిన పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితులకు సంబంధించిన వారి పై పోరాడకుండా, బీజేపీ కార్యాలయం, ఎమ్మెల్యే రఘునందన్ పై విమర్శలు చేయడం దేనికి సంకేతమని డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలకు బీ టీమ్ గా వ్యవహరిస్తుందని డీకే అరుణ ఆరోపించారు. ఇకనైనా పోలీసులు పక్షపాత ధోరణిమాని , నిందితులకు కొమ్ముకాయకుండ, బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలని, నగరంలో శాంతి భద్రతల పై శ్రద్ధ వహించాలని పోలీసులకు బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ సూచించారు.