Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణోత్సవ కార్యక్రమం జరగనుంది. హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలంతా సిద్ధమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ క్రమంలో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన అక్బరుద్దీన్.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేస్తారు. ఉదయం 8:30కి అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కొత్త MLAలతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాగా.. హైదరాబాద్ పాతబస్తీలో పండగ వాతావరణం నెలకొంది. సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడం, మరోవైపు అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ పదవి రావడంపై ఎంఐఎం కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇదిలాఉంటే.. ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎంఐఎం రజాకార్ల పార్టీ అని.. ఆ పార్టీ నేతలు ప్రమాణం చేయిస్తే తామెలా చేస్తామంటూ ప్రశ్నించారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ప్రమాణం చేయబోరని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వమంటూ రాజాసింగ్ స్పష్టంచేశారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగుతుంది. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. అయితే, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..