తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. శనివారం అసెంబ్లీలో వాడివేడీ చర్చల అనంతరం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటన చేశారు. శనివారం అసెంబ్లీ మొదలైన వెంటనే కాంగ్రెస్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప, చెప్పుకోవడానికి ఏముంది అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.
ఇక ప్రతిపక్షాల దాడికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మొత్తం మీద ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అనంతరం.. దీనిపై క్లారిఫికేషన్ అడిగేందుకు బీఆర్‌ఎస్ తరపున మాజీమంత్రి హరీశ్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన క్లారిఫికేషన్‌కు పరిమితం కాకుండా చర్చ చేయడం సరికాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
ఇదే విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా హరీశ్ రావుకు సూచనలు చేశారు. కేవలం క్లారిఫికేషన్‌కు మాత్రమే పరిమితం కావాలని కోరారు. అయితే గతంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి ప్రసంగం తరువాత ఇద్దరు విపక్ష సభ్యులకు అవకాశం కల్పించారని.. తనకు కూడా అలాంటి ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. లేకపోతే తాను నిరసన తెలియజేస్తానని అన్నారు. మరోవైపు సభలో ఈ అంశంపై గందరగోళం కొనసాగుతుండగానే.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ఈ నెల 20కు వాయిదా వేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..