Telangana Elections: తెలంగాణ ఎన్నికలు అప్పుడే..! సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో జమిలిపై సరికొత్త చర్చ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయ్‌... 2023 కదా. అంటే మళ్లీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయ్‌? లెక్క ప్రకారం 2028దే కదా.. కానీ ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరమీదకు రావడం.. చర్చనీయాంశమవుతోంది. 2028 కాదు.. 2029.. అంటూ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్‌ చేయడం సంచలనంగా మారింది. జమిలి తథ్యమంటూ సీఎం వాఖ్యానించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telangana Elections: తెలంగాణ ఎన్నికలు అప్పుడే..! సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో జమిలిపై సరికొత్త చర్చ
CM Revanth Reddy on One Nation One Election

Updated on: Mar 19, 2026 | 7:30 AM

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి… అక్కడ మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు, ఏకంగా శాసనసభలో అదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతో… తెలంగాణలో వచ్చే ఎన్నికలు… 2028లో కాదు, 2029లోనే ఉంటాయనే గుసగుసలు మొదలయ్యాయి.

ముఖ్యమంత్రి ధీమాను చూస్తుంటే.. జమిలి ఎన్నికలపై ఆయన గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగబోవనీ… 2029లోనే జరుగుతాయని.. ఆదిశగా కేంద్రం కసరత్తు చేస్తోందని ఇటీవల ఢిల్లీలో మాట్లాడిన రేవంత్‌… ఇప్పుడు నిండు సభలోనూ అదే స్టయిల్‌లో కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌ని తొక్కిపడతామంటూ సవాల్ చేసిన రేవంత్‌ ఆ కోపంలోనూ.. టంగ్‌ స్లిప్పవకుండా… 2029లో తొక్కకపోతే చూడాలంటూ… ఎన్నికలెప్పుడనే విషయంలో పెద్ద హింట్‌ ఇచ్చారు.

2029లోనైనా జమిలి సాధ్యమేనా?

ఓవైపు జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం… నియోజకవర్గాల పునర్విభజనపై నేతలు, పార్టీల ఆశలు… ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు… చాన్నాళ్లుగా రకరకాల చర్చలు జరుగుతున్న వేళ… అసలు 2029లోనైనా మూకుమ్మడి సాధ్యమా? అనే ముచ్చట ఇప్పుడు తెరమీదకు వచ్చింది. మరోవైపు 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతోనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు 2024లోనే ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్‌. దీనికి అనుగుణంగా డిసెంబర్ 2024లో లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని కూడా వేసింది.

కాగా, రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది కోవింద్‌ కమిటీ. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు.. రెండో దశలో మున్సిపాలిటీలు, పంచాయతీల వంటి స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలని నివేదిక ఇచ్చింది. అయితే, దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ అవసరం కావడం… రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం… జమిలి ప్రాసెస్‌ను లేట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us