Telangana Election: ముగిసిన నామినేషన్ల పర్వం.. 606 నామినేషన్ల తిరస్కరణ.. మిగిలింది సమరమే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఎన్నికల సంఘం ఆమోదం పొందాయి. 606 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగుతున్న రెండు నియోజకవర్గాలు.. గజ్వేల్‌లో 44 మంది, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Telangana Election: ముగిసిన నామినేషన్ల పర్వం.. 606 నామినేషన్ల తిరస్కరణ.. మిగిలింది సమరమే..!
Telangana Elections

Updated on: Nov 16, 2023 | 6:50 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఎన్నికల సంఘం ఆమోదం పొందాయి. 606 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగుతున్న రెండు నియోజకవర్గాలు.. గజ్వేల్‌లో 44 మంది, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బుజ్జగింపులు, చర్చల మధ్య ప్రధాన పార్టీల రెబల్స్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించారు. స్క్రూటినీ తర్వాత 114 మంది బరిలో ఉండగా.. 70 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గజ్వేల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు చెరకు రైతులు, ఇద్దరు భూ నిర్వాసితులు కూడా పోటీలో నిలిచారు. 44మంది అభ్యర్థులకు మొత్తం మూడు బ్యాలెట్లు అవసరమంటున్నారు ఈసీ అధికారులు.

సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 39 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత కామారెడ్డిలో 58 మంది పోటీలో ఉండగా.. 19 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌లో రెబల్స్‌తో అధిష్టానం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. చాలా స్థానాల్లో రెబల్స్‌ తమ నామినేషన్స్‌ వెనక్కి తీసుకున్నారు. సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌రెడ్డి, జుక్కల్‌లో గంగారాం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూనాయక్‌, వరంగల్‌ ఈస్ట్‌లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అధిష్టానం ఊపిరి పీల్చుకుంది.

మొత్తం 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఈసీ ఆమోదం పొందాయి. 606 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. రంగారెడ్డి జిల్లాలో 211, మేడ్చల్‌లో 126 మంది, వికారాబాద్‌ జిల్లాలో 61మంది బరిలో నిలిచారు. మొత్తం 108 మంది నామినేష్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోవడంతో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు తమ దృష్టిని ప్రచారంపై కేంద్రీకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహరచన చేసుకోవడంలో నిమగ్నమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…