అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నవంబర్ ఏడో తేదీన హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాన బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నవంబర్ ఏడో తేదీన రాష్ట్రానికి రానున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.
ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాన మంత్రి బీసీ గర్జన బహిరంగ సభ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సభను భారీగా నిర్వహించడానికి బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సభ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ…తెలంగాణలో బీసీ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
బీసీ సీఎం అంశమే ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. మెజార్టీ ఓటర్లయిన బీసీల ఓట్లు రాబట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లను ఇప్పటి వరకు అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప వారిని రాజ్యాధికారంలోకి తీసుకురావడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు హైదరాబాద్ లో ప్రధాన మంత్రి పాల్గొనే బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే అందులో ఏయే అంశాలుంటాయి. ప్రధాని ఏం హామీలిస్తారనే దానిపై ఇటు బీజేపీ శ్రేణుల్లోనే గాక ప్రత్యర్థి పార్టీల్లో కూడా ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…