తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలు ప్రకటించిన విపక్షాలకు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 25న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరగనున్న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ తీయబోతున్న అస్త్రాలు ఏంటి? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేని కొత్త స్కీమ్‌లను సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారా? తన దగ్గర ఉన్న అస్త్రాలు తీస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేవంటూ సీఎం కేసీఆర్.. గతంలో చాలా సందర్భాల్లో అన్నారు. ఈ మాటలకు అర్థం ఏంటి? తెలంగాణ దంగల్, చివరి చరణంలో అడుగు పెట్టిన వేళ…ఈ నెల 25న తన అమ్ముల పొదిలో నుంచి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ కొత్త హామీ ప్రకటించారు. ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు 100 కోట్ల రూపాయల ఫిట్ నెస్ సర్టిఫికెట్ చార్జీలను అధికారం లోకి రాగానే రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ప్రతి ఏటా కట్టాల్సిన ఫిట్‌నెస్ ఫీజు రూ.700, పర్మిట్ రూ.500 మాఫీ చేస్తాం అని ఆయన ప్రకటించారు.
ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ నోట కొత్త హామీలు రాలేదు. అయితే ఆయన తాజాగా ఓ సరికొత్త హామీని ఇవ్వడంతో.. ప్రతిపక్షాలకు ఝలక్ తగిలినట్లయింది. బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ చెప్పింది టీజర్ మాత్రమే అని, పరేడ్ గ్రౌండ్స్‌లో నవంబర్ 25న జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ మరిన్ని కొత్త స్కీమ్‌లు ప్రకటిస్తారు అనే చర్చ జోరందుకుంది. ఆయన మూడు, నాలుగు కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి ఓ స్కీమ్ గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక యూత్‌ను ఆకట్టుకునే పథకాలతో పాటు మధ్య తరగతి టార్గెట్‌గా హామీలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో తాను కొత్త అస్త్రాలు సంధిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలా అని విపక్షాలు ఆలోచనలో పడేలా చేశారు గులాబీ బాస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…