Telangana: ఆ రంగాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్.. రాబోయే రోజుల్లో వేలల్లో ఉద్యోగాలు!

తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ స్పష్టమైన దిశ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గచ్చిబౌలి ఐఎస్బీ లో జరిగిన ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేగవంతమైన మార్పులను తెలంగాణ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా పనిచేస్తుందన్నారు.

Telangana: ఆ రంగాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్.. రాబోయే రోజుల్లో వేలల్లో ఉద్యోగాలు!
Duddilla Sridhar Babu

Edited By: Anand T

Updated on: Nov 15, 2025 | 4:13 PM

గచ్చిబౌలి ఐఎస్బీ లో సమ్మిట్‌ను కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌బీ, ముంజాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కలిసి నిర్వహించిన ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేగవంతమైన మార్పులను తెలంగాణ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా పనిచేస్తుందన్నారు. ప్రపంచంలో గ్లోబల్ సప్లై చెయిన్ ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో నమ్మకమైన తయారీ కేంద్రాల కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, ఇది తెలంగాణకు పెద్ద అవకాశమని అన్నారు. గతేడాది దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.5 లక్షల కోట్లను దాటడం, రక్షణ ఎగుమతులు 12 శాతం వృద్ధి నమోదు చేయడం దేశ శక్తిని సూచిస్తోందని వివరించారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం కీలక భాగం కానుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 25కి పైగా అంతర్జాతీయ, జాతీయ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలు, 1,500కి పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి తీసుకెళ్తున్నాయని తెలిపారు.

రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ 2023–24లో రూ.15,900 కోట్లుగా ఉండగా, 2024–25లో తొలి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల విజయాన్ని చూపిస్తోందని మంత్రి చెప్పారు. ఆదిభట్లలో టాటా, సాఫ్రాన్ రూ.425 కోట్ల విలువైన యంత్రాంగం ఇటీవల ప్రారంభమైందని, త్వరలోనే జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ రూ.800 కోట్లతో యూఏవీ తయారీ కేంద్రం, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ రూ.500 కోట్లతో డిఫెన్స్ ఫెసిలిటీ కూడా ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. ఇంకా పలువురు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయని మంత్రి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.