ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు.. ఆస్పత్రికి బాధితుల క్యూ.. మహబూబ్‌నగర్‌లో 3కి చేరిన మృతుల సంఖ్య..

|

Apr 13, 2023 | 8:43 AM

ఒకరికి మాట పడిపోయింది.. మరొకరికి మూతి వంకర పోయింది.. ఇంకొకరు ఫిట్స్ వచ్చినట్టు ఊగిపోయారు.. ఏం జరుగుతుందో తెలియదు.. ఒకరి తర్వాత మరొకరు.. వింత చేష్టలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మహబూబ్​నగర్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది.

ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు.. ఆస్పత్రికి బాధితుల క్యూ.. మహబూబ్‌నగర్‌లో 3కి చేరిన మృతుల సంఖ్య..
Toddy
Follow us on

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. 40 మందికిపైగా బాధితులు ఆస్పత్రిలో చేరగా.. వారిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. చనిపోయినవారిలో కోడూరుకు చెందిన అంజయ్య, అంబేద్కర్‌నగర్‌కు చెందిన విష్ణుతోపాటు రేణుక అనే మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్లులో కల్తీ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే వరుస మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు. కల్లు శాంపిల్స్‌ను FCLకు పంపించామని, ఆ రిపోర్ట్‌ వచ్చే వరకు అది కల్తీకల్లు అని చెప్పలేమని ఆయనన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

కల్తీ కల్లు ఘటనపై అసత్యాలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. మంత్రి కసన్నుల్లో కల్తీ కల్లు దందా జరుగుతుందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కూడా కల్తీ కల్లు కారణంగా పలువరు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి కల్తీకల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్లుకు బానిసై పిచ్చి పట్టి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ రకమైన పరిస్థితి నెలకొనడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..