డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
Job Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బద్వేల్‌కు చెందిన 23 ఏళ్ల వెంకటేష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతను మాదాపూర్‌లో ఉంటున్నాడు. గత డిసెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాయి చౌదరి’ పేరుతో ఉన్న ఐడీ ద్వారా కిశోర్ అనే వ్యక్తి.. జాబ్ ఇప్పిస్తానని చెప్పి అతడిని నుంచి రూ. 2 లక్షలు కాజేశాడు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, బద్వేల్‌కు చెందిన గొడ్డుమారి వెంకటేష్ (23) ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతను మాదాపూర్‌లో నివసిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో సాయి చౌదరి అనే ఐడీ ద్వారా కిశోర్ అనే వ్యక్తి అతనికి పరిచయమయ్యాడు.
తాను డెలాయిట్ కంపెనీలో పైథాన్ డెవలపర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన నిందితుడు, వివిధ కారణాలు చెబుతూ బాధితుడి నుంచి దశలవారీగా రూ.2 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కిశోర్ స్పందించడం ఆపేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన వెంకటేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరో దారుణం.. యూట్యూబ్‌లో చూసి వ్యక్తిని హత్య చేసిన తల్లీకొడుకు
హైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ చెరుకుపల్లి కాలనీలో మే 3వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా నివసిస్తున్న శివారెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించగా, అదే ఇంట్లో ఉన్న అరుణ, ఆమె కుమారుడు సాయిరత్నంను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో శివారెడ్డి గత కొన్నేళ్లుగా అరుణతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే అతను మద్యం మత్తులో వారిని వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతని వేధింపుల నుంచి బయటపడేందుకు తల్లి, కుమారుడు కలిసి అతన్ని హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. పథకం అమలు కోసం ముందుగా సామాజిక మాధ్యమాల్లో సమాచారం వెతికినట్లు, అనంతరం కత్తి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఆ తర్వాత శివారెడ్డి నిద్రలో ఉన్న సమయంలో అతనిపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఘటన అనంతరం ఆధారాలు దాచేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరికి ఒక స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.
