Telangana: ‘నేను ఎప్పటికి తెలంగాణ ప్రజల సోదరినే’.. ఎయిర్‌పోర్ట్‌లో తమిళిసై ఎమోషనల్

|

Mar 18, 2024 | 7:35 PM

తెలంగాణకు తమిళిసై... బై బై చెప్పేశారు. గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి... చెన్నైకి షిప్ట్‌ అయిపోయారు. అసలు తమిళిసై రాజీనామాకు రీజనేంటి...? పొలిటికల్‌ రీఎంట్రీకి రెడీ అవుతున్నారా...? అలా అయితే బీజేపీ ఇచ్చిన ఆఫరేంటి...? మేడమ్‌ వ్యూహమేంటి...?

Telangana: నేను ఎప్పటికి తెలంగాణ ప్రజల సోదరినే.. ఎయిర్‌పోర్ట్‌లో తమిళిసై ఎమోషనల్
Dr Tamilisai Soundararajan
Follow us on

ముందే ఊహించినట్లు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్ తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. గతంలో తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుందని చెప్పినట్లే… గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి పొలిటికల్‌ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. 2019లో తెలంగాణ గవర్నర్‌ పదవి చేపట్టిన తమిళిసై… గతేడాది నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడా రెండు పదవులకు రాజీనామా చేసి… ఆ పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు తమిళిసై. కాగా తెలంగాణను విడిచి వెళ్తూ.. ఎయిర్‌పోర్ట్‌లో కాస్త ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ విడిచి వెళ్లడం బాధగా ఉందన్నారు. ఈ ప్రయాణం ఎంతో మధురమైంది అన్నారు. తెలంగాణలోని అన్నలు, చెల్లెళ్లు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడి ప్రజలతో టచ్‌లో ఉంటానన్నారు. తాను ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ ప్రజలు సోదరిని అని చెప్పుకొచ్చారు.

గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు తమిళిసై. 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రమనాథపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. అలాగే 2019లో చెన్నై నార్త్‌, 2019లో తూత్తుకూడి నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారామె. అయితే పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించి 2019లో తెలంగాణ గవర్నర్‌ పదవిలో కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం.

ఇప్పుడు వ్యూహాత్మకంగానే బీజేపీ అధిష్టానం తమిళిసైతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితులతో… నాడార్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే చెన్నై సౌత్‌, తిరునల్వేలి, కన్యాకుమారి స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి ఆమెను పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్‌కు వీడ్కోలు చెప్పి… చైన్నై వెళ్లిపోయారు తమిళిసై. తెలంగాణను విడిచి వెళ్లడం బాధగా ఉందంటూనే… బై చెప్పేశారు.

మొత్తంగా… 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై… ఒక్కసారి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేదు. మరీ రీఎంట్రీతో అయినా ఆమె రాత మారుతుందో లేదో చూడాలి…