
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు వారం రోజుల క్రితం కోడి గుడ్ల కోసం రోడ్డు ఎక్కారు. ఆ మరుసటి రోజు చికెన్ కోసం పుర్రెలు పుచ్చకాయల్లా పగిలేలా తన్నుకున్నారు. తాజాగా చపాతీల కోసం ఏకంగా వంట గిన్నెలు రోడ్డుపైకి ఎత్తుకొచ్చి నిరసన చేపట్టారు. ఆ యూనివర్సిటీలో సిల్లీ నిరసనలు నివ్వెరబోయేలా చేస్తున్నాయి. యూనివర్సిటీ పరువు నవ్వుల పాలయ్యేలా చేస్తుంది. వసతుల కోసం కాదు.. మెస్ లో ఫుడ్ మెనూ పంచాయతీ ఆ విశ్వవిద్యాలయం పరువు బజారున పడేలా చేస్తుంది.. పాలకవర్గం కక్కుర్తి, విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
విద్యార్థులలో ప్రశ్నించే స్వభావం పెరిగిందా..! లేక ఆధిపత్య పంచాయితా..? లేదంటే అధికారుల కక్కుర్తా..? కారణాలు ఏవైనా కాకతీయ యూనివర్సిటీ లో రోజురోజుకు రోడ్డు ఎక్కుతున్న నిరసనలు ఎంతో చరిత్ర కలిగిన ఆ విశ్వవిద్యాలయం పరువును బజారున పడేలా చేస్తున్నాయి. మెనూ ప్రకారం చేయాల్సిన ఒక వంటకంకు బదులు మరో వంటకం పెట్టారని, వంటకంలో అడిగినంత పెట్టడం లేదని విద్యార్థులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా మెనూ ప్రకారం పెట్టాల్సిన చపాతీకి బదులు కిచిడి పెట్టారని విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ఏకంగా కామన్వెస్‌లోని వంట పాత్రలు ఎత్తుకొచ్చి నడిరోడ్డుపై పెట్టి హంగామా చేశారు.
ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి పరిచయం చేసిన కాకతీయ విశ్వవిద్యాలయం పరిస్థితి ఇప్పుడు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నయ్య మారింది. చిన్న చిన్న కారణాలతో విద్యార్థులు చేస్తున్న నిరసనలు ఈ విశ్వవిద్యాలయ పరువు ప్రతిష్టలు నడి బజారుకు ఈడ్చేలా చేశాయి. ఉన్నత విద్య కోసమో..! కొత్త కోర్సుల కోసమో లేదంటే మెరుగైన వసతుల కోసం విద్యార్థులు నిరసన చేయడం లేదు. కామన్ మెస్ లో ఫుడ్ మెనూ వీరిని ఆగ్రహానికి గురి చేస్తుంది.
గత 15 రోజుల నుండి కామన్ మెస్ లో వంటల విషయంలో నిరసన నెలకొంటున్నాయి. ఆ నిరసనను ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి. వారం రోజుల క్రితం కామన్ మెస్ లో కోడి గుడ్ల పంచాయతీ ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదం సద్దుమణిగిన మరుసటి రోజే చికెన్ కోసం జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చికెన్ ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ వడ్డిస్తున్నారని పరస్పర దాడుల్లో నలుగురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. కొంతమంది విద్యార్థులకు పుర్రెలు పుచ్చకాయల్లా పగిలిపోయాయి. ఆరుగురు విద్యార్థుల పైన కేసులు కూడా నమోదయ్యాయి.
తాజాగా అదే కామన్ మెస్ లో మరో ఘటన జరిగింది. మెనూ ప్రకారం గురువారం (మార్చి 05) ఉదయం విద్యార్థులకు చపాతి పెట్టాల్సి ఉండగా.. దానికి బదులు కిచిడీ పెట్టారని కొంతమంది విద్యార్థులు ఆగ్రహించారు. ఏకంగా కిచిడి వండిన వంట పాత్రను మెస్ నుండి ఈడ్చుకు వచ్చి కాకతీయ యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు పెట్టి నిరసన తెలిపారు. కొంతమంది విద్యార్థులు కిచిడి వండిన వంటపాత్రను అక్కడి నుంచి ఎత్తుకు రావడంతో మిగిలిన విద్యార్థులకు సకాలంలో బ్రేక్ ఫాస్ట్ అందక ఆకలితో అలమటించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులతో కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్, పోలీసులు నచ్చజెప్పి ఆ వంట పాత్రలు మళ్ళీ తిరిగి కిచెన్ లోకి తీసుకెళ్లారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. కాగా, యూనివర్సిటీ విద్యార్థులు ఈ విధంగా చిన్న చిన్న కారణాలతో రోడ్డు ఎక్కడం, వంటపాత్రలను రోడ్డుపైకి తీసుకురావడం ఆందోళనకు గురిచేస్తుంది. ఎంతో చరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీ పరువు బజారుకు ఇస్తున్నారని విశ్వవిద్యాలయం అధ్యాపకులు పిల్లల పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అ
అయితే, విద్యార్థుల వర్షన్ మాత్రం మరోలా ఉంది.. కామన్ మెస్ ను కేరాఫ్ గా చేసుకుని కొంతమంది అధికారులు విద్యార్థుల సొమ్మును మెక్కేస్తున్నారని, విద్యార్థులకు కనీసం పౌష్టిక ఆహారం అందించడం లేదని ఆరోపిస్తున్నారు. కొంతమంది ప్రశ్నించిన వారికి మాత్రమే మెరుగైన ఆహారం వారికి కోరినటువంటి ఆహార పదార్థాలు అందిస్తున్నారని తమ పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..