AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్.. ఎన్ని సీజ్ చేశారంటే?

విద్యార్థుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించిన 245 వాహనాలను గుర్తించి, ఫిట్‌నెస్ లేని 60 స్కూల్ బస్సులను సీజ్ చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పిల్ల భద్రతపై తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్.. ఎన్ని సీజ్ చేశారంటే?
Telangana School Bus Inspection
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 3:10 PM

Share

హైదరాబాద్: విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి స్కూల్, కాలేజీ బస్సుల భద్రతపై దృష్టి సారించింది. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్న 245 విద్యాసంస్థల వాహనాలను అధికారులు గుర్తించగా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 60 స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పలు కీలక లోపాలు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. అలాగే డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా, వారికి తగిన డ్రైవింగ్ అనుభవం ఉందా అనే అంశాలను కూడా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అటెండెంట్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అంతేకాకుండా బస్సుల బ్రేకులు, టైర్లు, లైట్లు వంటి యాంత్రిక భాగాల పనితీరును కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని వాహనాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, మరికొన్నింటిలో అవసరమైన పత్రాలు లేకపోవడం గుర్తించినట్లు సమాచారం. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఎలాంటి రాజీ ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.

ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్న బస్సులను వెంటనే సీజ్ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులు, డ్రైవర్లు మాత్రమే కాకుండా సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది.

రవాణా శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం 25,987 విద్యాసంస్థల బస్సులు ఉండగా, వాటిలో 23,204 బస్సులకు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయి. మిగిలిన 2,783 బస్సులు తక్షణమే ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాలని అధికారులు ఆదేశించారు. తమ పిల్లలను స్కూల్ బస్సుల్లో పంపే ముందు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఓవర్‌లోడింగ్ లేదా నిబంధనలు పాటించని వాహనాల గురించి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us