
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శాంతి లభించాల్సిన చోట పాముల భయం వెంటాడుతోంది. దేవస్థానం ఆధీనంలోని వసతి గృహాలు, ధర్మశాలలు, ఆలయ పరిసరాల్లో తరచూ పాములు ప్రత్యక్షమవుతుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పార్వతిపురం ధర్మశాల కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్షం కావడం అలజడి చెలరేగింది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయగా, అధికారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకుని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో అప్పటికి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నప్పటికీ, అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది.
ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, వసతి గృహల వద్ద తరచూ పాములు దర్శనమవుతుండటం భక్తులను వణికిస్తోంది. దర్శనానికి వచ్చే భక్తులు, వసతి గృహాల్లో బస చేసే యాత్రికులు రాత్రివేళ బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికుల మాటల్లో ఆలయ పరిసరాల్లోని పాత భవనాలు, పాడైపోయిన నిర్మాణాలు, చెత్త పేరుకుపోవడం, పాములకు ఆలయ పరిసరాలను సురక్షిత ఆశ్రయంగా మార్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం పాము కనిపిస్తే పట్టించి వదిలేయడమే పరిష్కారమన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వేములవాడకు తరలివస్తున్న నేపథ్యంలో, ఇలాంటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తే బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. దేవస్థానం పరిధిలో భక్తుల ప్రాణ భద్రతకు హామీ ఇవ్వాల్సిన అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో సమగ్ర పరిశుభ్రత, పాత భవనాల మరమ్మతులు పాములు రాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టకపోతే వేములవాడలో పాముల భయం మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.