
నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, మారిన అలవాట్లు మనుషులను శారీరకంగానే కాకుండా మానసికంగానూ దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మానవ శరీరానికి అత్యంత కీలకమైన నిద్ర ను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల నేరుగా ఐసీయూ దాకా వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, మన దేశంలోనూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలోనూ నిద్రలేమి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 37 శాతం మంది ప్రజలు తీవ్రమైన నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.భాగ్యనగరంలో పనిచేస్తున్న కార్పొరేట్, ఐటీ ఉద్యోగుల్లో ఏకంగా 62 శాతం మందికి కంటినిండా నిద్ర కరువైందనీ లెక్కలు చెబుతున్నాయి. ఈ సమస్య కేవలం పట్టణాలే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 22 శాతం నుంచి 31 శాతం వరకు ప్రజలు నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గాఢ నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.శరీరం తనను తాను పునరుద్ధరించుకునే ప్రక్రియ. రాత్రి వేళ నిద్ర సరిగ్గా పట్టకపోతే.. ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు మరియు గుండెజబ్బులు ముంచుకొస్తాయి. నిద్రలో మెదడు వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. నిద్ర తగ్గడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.
పడుకునే ముందు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం వల్ల శరీరంలో నిద్ర తెప్పించే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది.పడుకోవడానికి సరిగ్గా ముందు భారీగా తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగక నిద్ర భంగమవుతుంది. రాత్రి వేళల్లో టీ, కాఫీలు, సిగరెట్లు, మద్యం తాగే అలవాటు వల్ల రాత్రిళ్ళు పదే పదే మెలకువ వస్తుంది.
ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్రపోవాలి. పడుకోవడానికి కనీసం 1 నుండి 2 గంటల ముందే మొబైల్, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే రాత్రి భోజనం పూర్తిచేయాలి. బెడ్‌రూమ్‌లో లైట్లు ఆపివేసి, గది ఉష్ణోగ్రత ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. సొంతంగా నిద్రమాత్రలు వాడటం ప్రాణాలకే ప్రమాదం.అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారంతో పాటు ప్రశాంతమైన నిద్ర కూడా అత్యంత ఆవశ్యకమని వైద్య నిపుణులు గుర్తుచేస్తున్నారు.