SLBC Tunnel Rescue Operation: మిగతా ఆరుగురు జాడ ఎక్కడ..? టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకంటే..

SLBC Tunnel Rescue: సుదీర్ఘ కాలం పాటు సాగిన SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. ఫిబ్రవరి 22న టన్నెల్ లో ప్రమాదం జరిగిన డేంజర్ జోన్ మినహా మట్టి, బురద తవ్వకాలు, శిథిలాల తొలగింపు పూర్తయింది. ఇక గల్లంతైన ఎనిమిది మందిలో కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

SLBC Tunnel Rescue Operation: మిగతా ఆరుగురు జాడ ఎక్కడ..? టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకంటే..
Telangana SLBC Tunnel Rescue Operation

Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 26, 2025 | 1:52 PM

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట SLBC టన్నెల్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఘోర ప్రమాదం సంభవించింది. టన్నెల్ లో TBM మిషన్ తో సొరంగం తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా పై కప్పు కూలింది. షీర్ జోన్ కావడంతో TBM మిషన్ అమర్చుతున్న సెగ్మెంట్ లు కూలీ మిషన్ మీద పడిపోయాయి. పై నుంచి బలంగపడిన భారీ బండరాళ్లు, పెద్ద మొత్తంలో మట్టి, బురద 120 మీటర్ల TBM మిషన్ ను చెల్లాచెదురు చేశాయి. 1500టన్నుల బరువున్న TBM మిషన్ ఏకంగా 200మీటర్ల వరకు వెనక్కి నెట్టుకొచ్చింది. ఇక ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది ప్రమాదాన్ని పసిగట్టి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోగా.. ఎనిమిది మంది మాత్రం ప్రమాదంలో గల్లంతయ్యారు. ఇక ఘటన ఉదయం 8గంటల సమయంలో చోటు చేసుకోగా.. సాయంత్రానికల్లా NDRF బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. ఆ తరువాత SDRF, ఆర్మీ, నేవి, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే, క్యాడవర్ డాగ్స్ బృందం ఇలా అన్ని రకాల బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యం అయ్యాయి. దేశంలోనే టన్నెల్ ఎక్స్‌పర్టస్‌ ను సైతం తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించింది. అయితే 63 రోజుల పాటు శ్రమించిన రెస్క్యూ బృందాలు. టన్నెల్ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాయి. GSI, NGRI శాస్త్రవేత్తలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా గుర్తించడంతో ఆ ప్రదేశం మినహా మిగిలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగించారు. ఇక 63రోజుల తర్వాత డేంజర్ జోన్ మినహా మట్టి, బురద తవ్వకాలు, శిథిలాల తొలగింపు పూర్తయింది. ఇక గల్లంతైన ఎనిమిది మందిలో అతి కష్టం మీద ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

లక్ష్యానికి అనుగుణంగా సహాయక చర్యలు పూర్తి కావడంతో తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. డేంజర్ జోన్ లో తవ్వకాల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే తదుపరి టన్నెల్ నిర్మాణం పూర్తికి సైతం ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంది. సహాయక చర్యలకు సుమారు మూడు నెలలు బ్రేక్ రావడంతో టన్నెల్ నుంచి ఎక్స్ కవేటర్లు బయటకు వస్తున్నాయి. ఇక ఇన్ని రోజులు అవిశ్రాంతంగా శ్రమించిన సహాయక బృందాలు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాయి. గల్లంతైన మిగతా ఆరుగురి కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టన్నెల్ పూర్తికి DBM మోడల్:

ఇక టన్నెల్ ను పూర్తి చేసేందుకు డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్(DBM) విధానంలో ముందుకు వెళ్ళాలన్న యోచనలో ఉన్న నిపుణుల కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొన్ని మీటర్లు వెనక్కి వచ్చి SLBC సొరంగం పూర్తి కోసం బై పాస్ మార్గం తవ్వాలని గతంలోనే నిపుణులు సూచనలు చేశారు. మన్నెవారిపల్లి నుంచి TBM మిషన్ తోనే తవ్వకాలు కొనసాగిస్తూ.. శ్రీశైలం ఇన్ లెట్ నుంచి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక SLBC టన్నెల్ లో షీర్ జోన్ ప్రదేశాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్ చీఫ్ సైంటిస్ట్ మైతాని పరిశీలించారు. ఇకముందు సొరంగం పనులు కొనసాగించడంపై అధ్యయనం చేస్తున్నారు. దీనికి తోడు ఇవాళ మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ ను మైతాని పరిశీలించనున్నారు. అనంతరం టెక్నికల్ కమిటీకి నివేదిక మైతాని నివేదిక సమర్పించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..