Question Paper Leak Case: తెలంగాణను కుదిపేస్తున్న TSPSC పేపర్ లీక్ వ్యవహారం.. దూకుడు పెంచిన సిట్‌

TSPSC పేపరు లీక్‌ కేసులో స్పీడ్‌ పెంచింది సిట్‌. కస్టడిలో ఉన్న నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ ఇవాళ కోర్టుముందు ప్రవేశపెడుతుంది. మరోవైపు TSPSCపై కాంగ్రెస్ ఫిర్యాదును స్వీకరించిన ఈడీ.. కేసు నమోదు చేసింది. అటు పేపర్ లీక్ వ్యవహారంపై ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్.

Question Paper Leak Case: తెలంగాణను కుదిపేస్తున్న TSPSC పేపర్ లీక్ వ్యవహారం.. దూకుడు పెంచిన సిట్‌
TSPSC

Updated on: Apr 03, 2023 | 7:19 AM

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తుంది. అధికార, ప్రతిపక్షాలు కేసు విషయంలో మాటల దాడి చేసుకుంటున్నాయి. అటు విద్యార్థి సంఘాలు సైతం ధర్నాలు, దీక్షలతో ఉద్యమాలు చేయడంతో పేపర్ల లీక్‌ కేసులో వేగం పెంచిన సిట్‌. కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది. పేపర్ల లీక్ కేసులో సూత్రధారులను.. పాత్రధారులను పసిగట్టే పనిలో దూకుడు పెంచింది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న షమీమ్‌, సురేష్‌, రమేష్‌లను ఐదో రోజుగా ప్రశ్నిస్తుంది. విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిపై యాక్షన్‌కు రెడీ అవుతోంది సిట్‌. ఇవాళ కోర్టులో ముగ్గురు నిందితులకు హాజరు పరిచేందుకు ఆదివారం కోఠి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. తర్వాత వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ పొడిగించాలన్న పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి కావడంతో.. కోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తి నెలకొంది.

TSPSC పేపర్ల లీకేజీ ప్రభుత్వ వైఫల్యంగా.. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు ఆరోపించారు. ఈ అంశంపై కలిసికట్టుగా పోరాడాలని ప్రోఫెసర్‌ కోదండరామ్‌ కోరగా.. ఈ పోరాటం కోసం మళ్లీ గోసి.. గొంగడి కడతానన్నారు గద్దర్‌. అటు తెలంగాణను కుదిపేస్తున్న TSPSC పేపర్ల లీక్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు ED కేసు నమోదు చేసిందన్నారు రేవంత్‌రెడ్డి. సిట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణపై పెదవి విరిచారు పీసీసీ చీఫ్‌. నిరుద్యోగులకు అండగా ఈ నెల 25న గజ్వేల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు రేవంత్‌.

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు మంత్రి హరీశ్‌రావు. పేపరు లీక్‌ను ప్రతిపక్షాలు బయట పెట్టలేదని.. ప్రభుత్వమే గుర్తించిందన్నారు మంత్రి. నిందితులను జైల్లో వేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో మరికొందరు కమిషన్‌ సభ్యులను కూడా సిట్‌ అధికారులు గ్రిల్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..