Flood Rescue: వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టి, కాపాడిన ఎస్ఐ..!

|

Jul 26, 2024 | 8:58 AM

వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించారు సిర్పూర్(టి) ఎస్ఐ రమేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం హుడికిలి గ్రామం దగ్గర పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో హుడికిలి లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ చుట్టు వరద నీరు చేరుకుంది.

Flood Rescue: వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టి, కాపాడిన ఎస్ఐ..!
Flood Rescue
Follow us on

వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించారు సిర్పూర్(టి) ఎస్ఐ రమేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం హుడికిలి గ్రామం దగ్గర పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో హుడికిలి లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ చుట్టు వరద నీరు చేరుకుంది. వాటర్ ట్యాంక్ కింద తాత్కాలిక నివాసం ఉంటున్న గోపాల్ అనే వ్యక్తి వరద నీటిలో చిక్కుకున్నాడు. వెంటనే ట్యాంక్ పైకి ఎక్కాడు. ట్యాంక్ చుట్టూ కనుచూపు మేర ఎటు చూసిన వరద నీరు చేరుకోవడంతో.. బయటకు రాలేక భయాందోళన చెందాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కున ట్యాంక్‌ పై గడిపాడు. విషయం తెలుసుకున్న సిర్పూర్(టి) ఎస్ఐ ధీకొండ రమేష్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. వాటర్ ట్యాంక్ పై నుండి తాడు సహాయంతో క్రిందకు దించి.. వరద నుంచి బయటకు తెచ్చారు. దీంతో గోపాల్ ఊపరిపీల్చుకున్నాడు. అతనికి నిత్యఅవసర వస్తువులు, దుప్పట్లు, బట్టలు ఇప్పించి సిర్పూర్(టి) లో పునరావాసం‌ కల్పించే ఏర్పాటు చేశారు ఎస్‌ఐ రమేష్.

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీని వరదలు వణికిస్తున్నాయి..జిల్లాలో అన్ని వాగులు భీకరం రూపం దాల్చాయి. బోధ్, నేరేడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర, సిరికొండ మండలాల్లో కుంభవృష్టి ఆగడం లేదు. ఇచ్చోడలో అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది.. సిరిచెల్మ వైపు 20 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్‌ మండలంలో పెద్ద వాగు పోటెత్తింది..కండ్రెవాగు సమీపంలోని 22 గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. నక్కలవాడ బ్రిడ్జి నీటిలో మునిగింది..

భారీ వర్షాల కారణంగా కుంటాల, పొచ్చెర జలపాతాలకు వరద పోటెత్తింది. ఈ వాటర్‌ ఫాల్స్‌ ప్రమాదకరంగా మారడంతో.. పర్యాటకులను అనుమతించడం లేదు..వరద ఉధృతి తగ్గిన తర్వాత..టూరిస్టులను అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అటు కడెం ప్రాజెక్టు వరద నీటితో భయపెడుతోంది..వరద ధాటి తట్టుకోలేక ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా కడెం ప్రాజెక్టు గేట్లు మొరాయించాయి.. చివరకు ఎలాగోలా అవస్థలు పడి..14గేట్లు ఎత్తి 1.55 లక్షల క్యూసెక్యుల నీటిని కిందకు వదిలారు..ఇంకా నాలుగు గేట్లు అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..