
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు అధికారి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, వారి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఆరోపణలపై సబ్ ఇన్‌స్పెక్టర్ కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వివాహితుడైన శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, వారితో సన్నిహిత పరిచయాలు ఏర్పరుచుకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. 2025లో ఫేస్‌బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీకాంత్, అనంతరం ఆమెతో సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో జమ్మికుంటలో విధులు నిర్వహిస్తున్న అతడు, బాధితురాలి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియో కాల్ రికార్డులను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు, ఇప్పటికే తీసుకున్న డబ్బును తిరిగి కోరినప్పుడు ప్రాణహాని కలిగిస్తానంటూ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో బాధితురాలు హనుమకొండ సుబేదారి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న శ్రీకాంత్ పరారయ్యాడు. గోవా, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో సుమారు నాలుగు నెలల పాటు తలదాచుకుని తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన మొబైల్ సిమ్ కార్డులను ధ్వంసం చేసి, కేవలం వైఫై ద్వారానే కమ్యూనికేషన్ కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అతడి కదలికలను గుర్తించారు. చివరకు నిజామాబాద్‌లో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని హనుమకొండకు తరలించినట్లు సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు.
దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించిన కేసు ఇప్పటికే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రెండు కేసుల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు మహిళలకు సూచించారు.