
ఓటు వేయలేదని మందలించడంతో మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని గోపులారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి అనిల్ కుమార్ (25) అనే యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఇటీవల జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో గోపులారం గ్రామానికి చెందిన సాయికుమార్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ తనకు ఓటు వేయలేదని సాయికుమార్ మందలించాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన అనిల్ కుమార్ తల్లి వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. అనంతరం శంకర్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనిల్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గోపులారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ కారణాలతో ఇలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని వారు పోలీసులను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.