
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం వెనుక కారణాలేంటి? ఈ పరిణామాలు కాంగ్రెస్ వ్యూహంలో భాగమా? బీఆర్‌ఎస్ హైకమాండ్ మౌన సందేశం దేనికి సంకేతం? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.
లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో రాజకీయం హీటెక్కుతోంది. అవిశ్వాసతీర్మానాల పర్వంలో మున్పిపాల్టీల్లో అధికార మార్పు తెరపైకి వచ్చింది. ఇక అసెంబ్లీలో కూడా జెండాలు మారనున్నాయా? ఎమ్మెల్యేల మనసులో మార్పు బీజం పడిందా? ముఖ్యమంత్రితో వరుసగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ములాఖాత్ అవుతుండటం చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి. మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. తాజాగా అదే బాటలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ ములాఖత్ పర్వం వెనుక అసలు కతేంటి? కానీ అదంతా ఏమి లేదని కొట్టి పారేస్తున్నారు గులాబీ నేతలు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కారుకు బై చెప్పి కాంగ్రెస్‌కు జై కొడుతారా?.. ములాఖాత్‌ల సీక్వెల్ అలాంటి సందేహాలకు బలం చేకూరుస్తోంది మరి. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రకాష్‌గౌడ్ ఇంటికెళ్లి కలిశారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కాబట్టి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారే తప్పా, మరే రాజకీయం లేదన్నారు ఇరువురు నేతలు. కట్ చేస్తే, ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన పార్టీ మారడం ఫిక్స్ అనే ప్రచారం జోరందుకుంది. మరి నిజంగా ఈ గూటి నుంచి ఆ గూటికి జంప్ అవుతారా? లేదా అన్నదీ గులాబీ శిబిరంలో కలవరపెడుతోంది.
అయితే ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలంతా చెప్పే మాట ఒక్కటే. నియోజకవర్గ అభివృద్ది కోసమే ముఖ్యమంత్రితో భేటీ.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అందరి మాట ఇదే. మరి నిజంగా అదే నిజమా?. బీఆర్‌ఎస్ హైకమాండ్ అలానే భావిస్తోందా?. కారు దళంపై కాంగ్రెస్ మార్పు మంత్రం ప్రయోగిస్తుందా? ఈ ముచ్చటపై ఎవరూ బయటపడటంలేదు. కానీ లోకసభ ఎన్నికల ముంగిట్లో డే బై డే కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధంలో పోటీ పీక్స్ వెళ్తుంది
అంతేనా.. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు మరింత పదనుతేలుతున్నాయి ఇలా.. లొల్లి మాములుగా లేదు. ఇంతకీ సీఎంతో ములాఖత్‌ల పర్వం వెనుక అసలు కతేంటి? బీఆర్‌ఎస్ హైకమాండ్ మౌనం దేనికి సంకేతం? నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామన్న ఎమ్మెల్యేల మాటలు నిజమనే అర్ధాంగీకారమా? లేదంటే వెళ్లే వాళ్లను ఆపడం ఎందుకనే మౌన సందేశమా? నిజం నిలకడ మీద తేలకుండా ఉంటదా!!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…