తెలంగాణలో ఇక నుంచి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ అందించనుంది ప్రభుత్వం. మొత్తం 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఒకే రకమైన చీరలను ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంవత్సరానికి రెండుసార్లు ఉచితంగా చీరలు పంపిణీ జరగనుంది. మహిళా సంఘాల యూనిఫామ్ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు చేయిస్తున్నారు. మంత్రి సీతక్క ఆఫీసులో మహిళా సంఘాల కోసం తయారు చేసిన చీరలను మంత్రికి చూపించారు SERP CEO దివ్య దేవరాజన్. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో యూనిఫామ్ చీరలను ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేస్తారు.
మరోవైపు తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో టీజీ ఫుడ్స్ పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. టీజీ ఫుడ్స్ కార్పొరేషన్ పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడం పట్ల మండిపడ్డారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడం పట్ల సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. తీరు మార్చు కోకపోవడం పట్ల మండిపడ్డారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలని, నిస్పక్ష పాతంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు. నాసి రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, సహకరించే అధికారులపై పట్ల చర్యలు తీసుకుంటామన్నారు సీతక్క. అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తప్పులు జరిగితే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మౌకిక ఆదేశాలు, వాట్సాప్ మెసేజ్ లతో పనులు జరగవని..దాపరికాలు ఉండకూడదన్నారు. అవకతవకలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎవరికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదన్నారు సీతక్క.
మరోవైపు కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన జరగడం పట్ల మంత్రి సీతక్క మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి