నిర్మల్ మున్సిపాల్టిలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకవతకలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అడ్డదారిలో 43 మందికి ఉద్యోగాలు కల్పించారంటూ ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్న అధికారులు కానీ, అధికార పార్టీ నేతలు కానీ కుయుక్కుమనడం లేదు. ఏకంగా మంత్రి , కలెక్టర్ వాటాలు వేసుకుని మరీ ఉద్యోగ అభ్యర్థుల నుండి వచ్చిన డబ్బులను పంచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది నిజమే అన్న తరహాలో మున్సిపల్ అధికారులు మౌనంగా ఉండటం అర్థాంగీకారంగా తోస్తోంది. బైంసా మున్సిపాలిటీలోనూ ఇదే తరహా అవినీతి జరిగిందని బీజేపీ, బీఎస్పీ , కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నాయి. మంత్రి ఇలాకాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ స్కాం జరిగినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్ మున్సిపాలిటీలో రోస్టర్ పద్దతిలో భర్తీ కావాల్సిన 44 ఉద్యోగాల్లో 43 ఉద్యోగాలను అక్రమ మార్గంలో అనర్హులకు కట్టబెట్టారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మీడియా వరుస కథనాలతో వ్యవహారం బయటకు పొక్కడంతో ఈ ఘటనపై ప్రతిపక్షాలు తాడో పేడో తేల్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. నిర్మల్ మున్సిపాల్టీలో జరిగిన అక్రమ ఉద్యోగాల భర్తీలో నిజాలు నిగ్గు తేలాలని.. సీఐడి తో వెంటనే విచారణ జరిపించాలంటూ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. నిర్మల్ లో పర్యటించిన బీజేపీ నేత యెండల లక్ష్మి నారాయణ సైతం ఘాటుగానే స్పందించారు. ఏకంగా మంత్రే దగ్గరుండి ముడుపుల వ్యవహారాన్ని చక్క బెట్టారని.. ఈ వ్యవహారంపై లోకా యుక్తకు వెళతామంటూ తెలిపారు. కాంగ్రెస్ ఓ అడుగు ముందుకు వేసి ఈనెల 23 న అర్హులైన ఉద్యోగ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని.. మున్సిపల్ , కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆ పార్టీ ఏఐసీసీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా పోస్టుల భర్తీ ప్రక్రియపై కలకలం రేగుతున్నా.. ఆధారాలు బయటకు వస్తున్నా అధికారులు, అధికార పార్టీ నేతలు సైతం కుయుక్కుమనడం లేదు. ఈ ఘటనలో కీలక పాత్రదారులుగా భావిస్తున్న ఉద్యోగుల గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెడుతుండగా.. కర్త,కర్మ,క్రియగా ఉన్బ కీలక ప్రజాప్రతినిధి పోస్ట్ ఊస్ట్ అయ్యే అవకాశాలున్నాయని చర్చ సాగుతోంది. ఇదే ఘటనలో చక్రం తిప్పారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డిని రాత్రికి రాత్రి బదిలీ చేయడం సైతం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల లిస్ట్ ఇప్పటికీ ఉపాధికల్పన అధికారులకు పంపకపోవడం.. ఆ 43 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు హాజరు కాకపోయినా ట్రెజరీ నుండి టంచన్ గా జీతాలు పడుతుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో మున్సిపల్ చైర్మన్ అల్లుడు , కొడుకు , కోడలు ఉండగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్ల బందువులు పారిశుద్య కార్మికుల పోస్ట్ లను అక్రమ మార్గంలో దక్కించుకున్నట్టు తెలుస్తోంది.