Keshava Rao: ఈ అంశంపైనే పీహెచ్‌డీ చేశాను.. సనాతన ధర్మంపై బీఆర్ఎస్ ఎంపీ కేకే సంచలన వ్యాఖ్యలు

Sanatana Dharma Row: సనాతనంపై బీఆర్ఎస్‌ ఎంపీ కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతనం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానిపై ఆరోపణలు చేశారు. సనాతనం ఆచరించే అందరూ ఏకమవ్వాలని చెబుతున్నారంటే..సనాతనం ఆచరించని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అని కేకే ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశం తర్వాత మీడియాతో కేకే ఈ మాటలన్నారు.

Sanatana Dharma Row: సనాతనం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆరోపణలు చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతనం ఆచరించే అందరూ ఏకమవ్వాలని ప్రధాని అన్నారని, అంటే సనాతనం ఆచరించని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అని కేకే ప్రశ్నించారు. ఇదివరకు దేశ ప్రజలను హిందూ, ముస్లిం పేరుతో విభజించారని, ఇప్పుడు సనాతనీ, నాన్-సనాతనీ పేరుతో హిందువుల్లోనే విభజన తీసుకొస్తున్నారా? అని నిలదీశారు. పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఉందని, ఇది సమాజంలో అసమానతలను సూచిస్తుందని అభిప్రాయపడ్డారు. తాను హిందువునేనన్న కేకే, దేవీ దేవతలను పూజిస్తానే గానీ సనాతనంను విశ్వసించనని స్పష్టం చేశారు. సనాతనం అంటే పురషసూక్తం ఒక్కటే కాదని, కానీ సనాతనంలో పురుషసూక్తం కూడా భాగమేనని వివరించారు. తాను ఈ అంశంపై పీహెచ్‌డీ చేశానని, దీనిపై ఎంత లోతుగానైనా మాట్లాడతాననని ఎంపీ కేకే సవాల్ విసిరారు. కంచి పీఠం, రాఘవేంద్ర మఠంలో గతంలో కొన్ని కులాలవారిని రానివ్వకపోవడం వివాదం కాలేదా? అని గుర్తు చేశారు.

మరోవైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రత్యేకత ఏంటో చెప్పలేదని విమర్శించారు కేకే.. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లడమే ప్రత్యేకత అని కూడా చెప్పడం లేదన్నారు. తొలి రెండ్రోజుల అజెండా చెప్పారని, తాము మహిళా బిల్లు, బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశామన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశాయని కేకే తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.