Success Story: గురుకులంలో చదివి.. పైలట్‌ శిక్షణకు ఎంపికైన కరీంనగర్ కుర్రోడి విజయగాథ

|

Dec 15, 2024 | 4:08 PM

పేద విద్యార్ధులకు కడుపు నిండా భోజనం పెట్టి, చదువు చెప్పి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దే గురుకుల విద్యాలయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు కూడా విద్యార్ధులను సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో చదివిన ఓ విద్యార్ధి ఏకంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సెలక్ట్ అయ్యి అందరినీ అబ్బురపరిచాడు..

Success Story: గురుకులంలో చదివి.. పైలట్‌ శిక్షణకు ఎంపికైన కరీంనగర్ కుర్రోడి విజయగాథ
Gurukul student selected for job at NDA
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15: కలలు అందరూ కంటారు. కానీ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. అందుకు ఎంతో కృష్టి, పట్టుదల అవసరం. ఒక్కోసారి సహనం కూడా విజయాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి వారు తాము అనుకున్నది పట్టుబట్టి సాధించుకుంటారు. ఇటువంటి కోవకు చెందిన వాడే ఈ తెలంగాణ కుర్రోడు. నిరుపేద కుటుంబంలో పుట్టినా గురుకులంలో చదివి జాతీయ స్థాయిలో మెరిసి తల్లిదండ్రులతోపాటు తన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు.

కరీంనగరంలోని చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌కు చెందిన రుక్మాపూర్‌ గురుకుల పాఠశాల విద్యార్థి రామడుగు సిద్ధార్థ గురించే మనం చర్చిస్తుంది. సిద్ధార్థ తల్లి జమున, తండ్రి మల్లయ్య. తల్లిదండ్రులు స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. పదోతరగతి వరకు రుక్మాపూర్‌ ఆదర్శ పాఠశాలలో చదివిన సిద్ధార్ధ.. దేశరక్షణలో పాలుపంచుకోవాలని ఇంటర్మీడియట్‌లో రుక్మాపూర్‌ సైనిక పాఠశాలలో చేరి రెండేళ్లపాటు శిక్షణ పొందాడు. జాతీయ స్థాయిలో 7 లక్షల మంది ఎస్‌ఎస్‌బీ పరీక్ష రాయగా.. చివరకు 612 మంది సెలక్ట్ అయ్యారు. అందులో స్థానం కైవసం చేసుకుని విజయం దక్కించుకున్నాడు సిద్దార్ధ.

సిద్ధార్ధ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పైలట్‌ శిక్షణకు ఎంపికయ్యాడు. సిద్ధార్ధ సాధించిన విజయానికి మెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సన్మానించి రూ.10 వేల చెక్కును అందజేశారు. ఇతనితోపాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన గురుకుల పాఠశాలల విద్యార్థులను సన్మానించారు. రుక్మాపూర్‌ గురుకుల పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్ధులకు విశ్రాంత సైనిక అధికారులతో ఇస్తున్న శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్ధులు చదువుతోపాటు క్రీడలు, ఉద్యోగ రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే వారి దినచర్య ప్రారంభమవుతుంది. దేశరక్షణలో భాగస్వాములు కావాలనే కలలను నెరవేర్చుకునేందుకు ఏటా యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్ష వీరంతా రాస్తున్నారు. ఇలా ఐదేళ్లలో 30 మందికి పైగా విద్యార్థులు NDAలో ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఇందులో గతంలో ఇద్దరు తుది దశకు ఎంపిక కాగా ఒకరు వైద్య పరీక్షలో విఫలం అయ్యారు. మరొకరు విజయం సాధించారు. అదే సిద్ధార్ధకు దక్కిన విజయం. నాలుగేళ్ల శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నాడు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.