Revanth Reddy: “ఓట్లేసి గెలిపించిన వాళ్లు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు”.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

|

Oct 09, 2022 | 7:34 PM

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు అంశం హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే పొలిటికల్ హీట్ నెలకొన్నప్పటికీ.. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి..

Revanth Reddy: ఓట్లేసి గెలిపించిన వాళ్లు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Revanth Reddy
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు అంశం హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే పొలిటికల్ హీట్ నెలకొన్నప్పటికీ.. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అది మరింత తీవ్రంగా మారింది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన వాళ్లు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారని వ్యాఖ్యానించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలోకి వెళ్లారన్న రేవంత్.. ఇక అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. పార్టీ మారాలని బెదిరిస్తే.. వారు ఎంతటి వారైనా సరే వాళ్ల వీపు విమానం మోత మోగుతుందని వార్నింగ్ ఇచ్చారు. గత కాంగ్రెస్‌ పాలనలో చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్‌కు అండగా నిలవాలని, తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నాలుగు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను గెలిపిస్తే ఎలాంటి మార్పు జరగలేదని, ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని చెప్పారు. అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు.

మహిళలంటే కేసీఆర్‌కు చిన్న చూపు. ఒక ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అవకాశం ఇవ్వండి. మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇస్తే మీ సమస్యలపై కొట్లాడి మీ వైపు నిలుస్తుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టండి. ఆడ బిడ్డల శక్తిని చూపించండి.

    – రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా గతంలో రేవంత్‌, రాజగోపాల్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. నువ్వొకటండే మేం రెండంటాం, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు-లేదంటే మర్యాద దక్కదు, నేను తలుచుకుంటే మునుగోడులో అడుగుపెట్టలేవ్‌ అంటూ రేవంత్‌పై (Revanth Reddy) చెలరేగిపోయారు బీజేపీ లీడర్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఇరవై వేల కోట్ల కాంట్రాక్ట్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయాడంటూ రేవంత్‌ చేసిన ఆరోపణలకు ఆయన తీవ్రంగా స్పందించారు. మరోసారి నోటికొచ్చినట్లు మాట్లాడితే, రేవంత్‌ చరిత్ర మొత్తం బయటపెడతానని వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటల దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ మునుగోడులో మూలమూలనా తిరుగుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతే ధీటుగా ప్రచారంలో దూసుకెళ్తూ.. హీటు పెంచుతున్నాయ్‌ కాంగ్రెస్‌, బీజేపీలు. మునుగోడు అడ్డాలో ఈసారి ఎగిరేది టీఆర్‌ఎస్‌ జెండానే అని అధికార నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..