Revanth Reddy: ఇవాళ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ కాంగ్రెస్

|

Jul 07, 2021 | 9:52 AM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్‌రెడ్డి. ఇప్పటికే గాంధీభవన్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

Revanth Reddy: ఇవాళ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ కాంగ్రెస్
Revanth Reddy
Follow us on

Revanth Reddy take oath as TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్‌రెడ్డి. ఇప్పటికే గాంధీభవన్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. మధ్యాహ్నం ఒకటిన్నారకు టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, గోవా, అండమాన్‌ పీసీసీల అధ్యక్షులు హాజరు కానున్నారు. రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌, పార్లమెంట్‌కు ప్రాతినధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలను తరలించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్‌గా నియమితుడైనప్పటి నుంచి పార్టీ సీనియర్లను కలుస్తూ వస్తున్న రేవంత్‌రెడ్డి.. నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ తాజా మాజీ చీఫ్‌ ఉత్తమ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిలను వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసానికీ వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

అయితే.. కాంగ్రెస్‌ అంటేనే కయ్యాల కాట్నం అన్న సెంటిమెంట్‌ను కాదని.. అందరు కలిసి ముందుకు వెళ్తారా? అన్నది ఇప్పుడు సీనియర్లతో పాటు.. అందరిలోనూ పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. ముందు అంతా ప్రశాంతంగా ఉన్నా.. అసలు మీటింగ్‌లలోనే తన్నుకున్న ఉదంతాలను గుర్తుకు చేసుకుంటున్నారు సీనియర్స్‌. ఇప్పటికే కొత్త పీసీసీని ప్రకటించిన తర్వాత అలక పాన్పు వహించిన కోమిటిరెడ్డి బ్రదర్స్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అయితే.. వారి రియాక్షన్‌ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పార్టీ శ్రేణులను వెంటాడుతున్న ప్రశ్న.

ఇదిలావుంటే, ఈ కుమ్ములాటలను ముందే గమనించిన రేవంత్‌.. టీపీసీసీ చీఫ్‌గా నియమితుడైన మరుక్షణం నుంచే రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత వరుసగా పార్టీ నేతలను వారి ఇళ్లకు వెళ్లి కలుస్తూ వచ్చారు. తనను వ్యతిరేకించిన వారి ఇళ్లకు కూడా వెళ్లి సహకారం కోరారు. వారి నుంచి అభినందనలూ అందుకున్నారు. తన పేరు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ఎంపీ వీహెచ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి.. ఆయన నుంచి అభినందనలు అందుకున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని అధిష్ఠానానికి వివరించారు.

దీంతో సోనియాగాంధీ స్వయంగా వీహెచ్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఇలా తొలి అడుగే అసంతృప్తులను సంతృప్తిపరిచే దిశగా వేశారు. ఇక రేవంత్‌ నియామకాన్ని బాహాటంగానే తప్పుబట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, రేవంత్‌ను కలిసేందుకు ఇష్టపడని నేతలను అధిస్ఠానమే రంగంలోకి దిగి దారిలోకి తెచ్చింది. తద్వారా రేవంత్‌కు అధిష్ఠానం అండగా నిలిచింది.

Read Also…  Corona Third Wave: సెప్టెంబర్ నాటికి పీక్ స్టేజ్‌లో థర్డ్‌ వేవ్.. ఎస్‌బీఐ షాకింగ్ రిపోర్ట్… ( వీడియో )