
బంగారం ధరలు బగ్గుమంటున్న ఈ రోజుల్లో అంతటి విలువైన వస్తువు దొరికితే ఎవరైనా పండగ చేసుకుంటారు. కానీ మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తన నిజాయితీని చాటుకున్నాడు. పోగొట్టుకున్న వ్యక్తికి రెండున్నర తులాల బంగారాన్ని తిరిగి అప్పగించి అందరి మన్ననలు పొందాడు. మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల వద్ద వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కుమారుడిని పాఠశాలలో దింపడానికి వచ్చాడు. ఈ క్రమంలో తన చేతికి ఉన్న బంగారు బ్రాస్‌లెట్‌ను పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా అది దొరకకపోవడంతో నిరాశతో వెళ్లిపోయాడు.
మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన ఆరవ తరగతి చదువుతున్న హర్షిత్ అనే విద్యార్థికి ఆ బంగారు బ్రాస్‌లెట్ దొరికింది. కానీ ఆ బాలుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఆ బ్రాస్‌లెట్‌ను నేరుగా తీసుకెళ్లి తన క్లాస్ టీచర్‌కు అప్పగించాడు. టీచర్ బంగారం పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించి అతడికి అప్పగించారు. విద్యార్థి హర్షిత్ నిస్వార్థమైన నిజాయితీని పాఠశాల యాజమాన్యం ప్రశంసించింది. పోగొట్టుకున్న రెండున్నర తులాల బంగారు బ్రాస్‌లెట్ లభించడంతో ఆ వ్యక్తి అమితానందం వ్యక్తం చేశారు. బాలుడి నిజాయితీకి కృతజ్ఞతగా.. పోగొట్టుకున్న వ్యక్తి పాఠశాలకు తన వంతుగా బోరు మోటార్‌ను అందజేసి ఉదారత చాటుకున్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థి హర్షిత్‌ను శాలువాతో సన్మానించి, అతని నిజాయితీని మెచ్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి