Telangana RTC Bus Wrecked: తెలంగాణలో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కాగా వరద ఉధృతి పెరగడంతో మరుసటి రోజుకు ప్రయత్నాన్ని వాయిదా వేశారు. మంగళవారం ఉదయం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయింది.
ఇదిలావుంటే, సోమవారం సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి 25 మంది ప్రయాణికులతో గంభీరావుపేట మీదుగా సిద్దిపేటకు వెళ్తోంది. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శివారులోని లోలెవల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తోంది. అయితే డ్రైవర్ గమనించకుండా బస్సును లోలెవల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జి అంచున బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అంతా దిగిపోయాక బస్సును ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేశారు. జేసీబీ సాయంతో బయటకు తీస్తుండగా, ఒక్కసారి బస్సుకు కట్టిన తాళ్లు తెగిపోయాయి. దీంతో వరద ప్రవాహనికి బస్సు నీటిలో కొట్టుకుపోయింది.