Rain Alert: అబ్బ సాయిరామ్.. తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ ముప్పు.? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారబోతోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తెలంగాణపై కూడా దీని ప్రభావం పడనుంది. మరి ఆ వాతావరణ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఓ సారి ఈ వార్త చూడండి.

Rain Alert: అబ్బ సాయిరామ్.. తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ ముప్పు.? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Alert

Updated on: Nov 27, 2025 | 7:05 AM

స్ట్రైట్ ఆఫ్ మలక్కా, దాని సమీపంలోని ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. తుఫాన్‌కు సెన్యార్‌ అని నామకరణం చేశారు. ఇండోనేషియా దగ్గర తుఫాన్ తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మలుపు తిరిగి తూర్పు దిక్కులో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం.. ఇటు తెలంగాణ, అటు ఏపీకి లేదని స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తదుపరి ఈ వాయుగుండం మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతానికి రాగల 48 గంటల్లో చేరుకుంటుందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రమంతా చలి తగ్గిందని పేర్కొన్నారు.

ఏపీలో ఇలా..

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం.. ఇప్పుడు మరింత బలపడే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం. ఇది కాస్తా.. ఉత్తర వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడుతుందని తెలిపారు. ఈ వాయుగుండం మరో రెండు రోజుల్లో పుదుచ్చేరి, తమిళనాడు దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఎల్లుండి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏపీపై వర్షాల ప్రభావం ఉంటుంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా.. 29న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌.. 30న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడపకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో.. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి మరో నాలుగు రోజుల వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.