తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత..

మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి నుంచే సెగలు పుట్టిస్తున్న సూర్యుడు కాస్త శాంతించనున్నాడు. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావంతో అటు తెలంగాణలో వారం రోజుల పాటు, ఇటు ఏపీలో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత..
Rains In Telangana And Andhra Pradesh

Updated on: Mar 16, 2026 | 8:37 AM

వేసవి భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనాన్ని ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు నేటి నుంచి ఈనెల 21 మధ్య కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. 10 సెం.మీ లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి రెండో వారం నుంచే 40 డిగ్రీలకు చేరుకున్న గరిష్ఠ ఉష్ణోగ్రతల నుంచి ఈనెల 21 వరకు ప్రజలకు భారీ ఊరట లభించనుంది.

ఏపీలో రెండు రోజుల పాటు వర్షాల సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రానున్న రెండు రోజుల పాటు వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి

తెలంగాణ, ఏపీలో పలుచోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా వాతావరణం మారడం వల్ల ఎండల తీవ్రత నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించనుంది.

Follow Us