Medaram Jatara 2026: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ గంటల్లోనే లభ్యం.. దానితోనే సాధ్యం

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026 సందర్భంగా చిన్నారుల భద్రత కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ విధానంతో ఇప్పటికే తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను గంటల వ్యవధిలోనే గుర్తించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చారు.

Medaram Jatara 2026: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ గంటల్లోనే లభ్యం.. దానితోనే సాధ్యం
Medaram Jatara 2026

Edited By:

Updated on: Jan 30, 2026 | 2:32 PM

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మల్టీ జోన్–2 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జాతర రద్దీ నేపథ్యంలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున, వారి భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్’ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీజీఎస్‌ఆర్టీసీ సహకారంతో భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, చిన్న పిల్లలకు ఈ రిస్ట్ బ్యాండ్లను ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌, హైదరాబాద్‌లోని ఉప్పల్‌, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లతో పాటు కరీంనగర్‌, పరకాల‌, పెద్దపల్లి‌, మంథని‌, ఏటూరునాగారం‌, కాటారం బస్ స్టేషన్లు, వరంగల్‌, కాజిపేట్ రైల్వే స్టేషన్లలో ఈ రిస్ట్ బ్యాండ్ల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జాతరలో ఎవరైనా చిన్నారి తప్పిపోయినట్లయితే, వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్‌పైని క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయాలని సూచించారు. స్కాన్ చేసిన వెంటనే లభించే ఫోన్ నంబర్ ద్వారా సంబంధిత బంధువులకు లేదా పోలీసులకు సమాచారం అందించి, చిన్నారిని త్వరగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చవచ్చని వివరించారు. ఎస్ఐబి ఐజీపీ శ్రీమతి బి. సుమతి, వోడాఫోన్ సంస్థ సహకారంతో ఈ వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఇప్పటికే ఈ క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు జాతరలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఐజీపీ తెలిపారు. కేవలం గంటల వ్యవధిలోనే ఇద్దరు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి, సురక్షితంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు చెప్పారు. కరీంనగర్ బస్టాండ్‌లో రిస్ట్ బ్యాండ్ ధరించిన మురళీకృష్ణ కుమారుడు అరియాన్ష్ (4) జాతరలో తప్పిపోగా, ఈ సాంకేతికత ద్వారానే అతడిని త్వరగా గుర్తించగలిగామని పేర్కొన్నారు. అలాగే హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్స్‌లో రిస్ట్ బ్యాండ్ ధరించిన గోవిందరావుపేట గ్రామానికి చెందిన మిల్కీ అనే బాలిక కూడా కొద్దిసేపటికే తన తండ్రి గుంజ నాగరాజు వద్దకు చేరిందని ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.