
ఈ మధ్యకాలంలో పశువుల అక్రమ రవాణాలో వెలుగుచూస్తున్న ఘటనలు పోలీసులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా పుష్ప సినిమాను తలపించే రీతిలో పశువులను అక్రమంగా తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న మూగజీవాల అక్రమ రవాణాను మహబూబాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. ట్రాలీ చుట్టూ కొబ్బరి బోండాలను పేర్చి, మధ్యలో మూగజీవాలను బంధించినట్లు పోలీసులు గుర్తించారు.
వాహనంలో మొత్తం 8 పశువులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాటిని హైదరాబాద్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. అంతేకాదు, పశువులను తరలించేందుకు ఉపయోగించిన వాహనానికి కనీసం నంబర్ ప్లేట్ కూడా లేదని పోలీసులు తెలిపారు. దీంతో వాహనంతో పాటు పశువులను, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పశువుల అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలి శివ, బంగారి లచ్చన్నగా పోలీసులు గుర్తించారు. వీరు గత కొంతకాలంగా ఇదే తరహాలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.