AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు కొండల మధ్య అద్భుతం.. ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?

నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిల్లా ఏడు కొండల మధ్య చారిత్రక వైభవంతో అలరారుతోంది. వేసవిలో బావులు, చెరువులు ఎండిపోతున్నా కోటలోని పురాతన కోనేరు మాత్రం నీటితో నిండుగా కనిపిస్తోంది. సహజ నీటి ఊటలు, భూగర్భ జల ప్రవాహమే దీనికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. వందల ఏళ్ల నాటి ఈ జల నిర్మాణం ప్రత్యేకత, ప్రస్తుత పరిస్థితులు ఆసక్తి రేపుతున్నాయి.

ఏడు కొండల మధ్య అద్భుతం.. ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?
Devarakonda Fort Telangana
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 04, 2026 | 11:35 AM

Share

ఒకవైపు ఎండలు మండి పోతున్నాయి.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.. బోర్లు వట్టి పోతున్నాయి.. బావులు ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నీటి కోసం జనం అల్లాడు తున్నారు. పైన మండే ఎండలు.. అయినా ఆ కోనేరులో మాత్రం నీరు నిండుగా ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన కోనేరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎండలకు సైతం ఎదురొడ్డి జలకళను ఎలా నిలుపుకుంటున్న కోనేరు ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఏడు కొండల మధ్య కొలువుదీరిన ఖిల్లా. తెలంగాణ చరిత్రలో దేవరకొండ ఖిల్లా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రాతి గోడలు.. బురుజులు.. కోట ద్వారాలు.. పురాతన నిర్మాణాలు.. ఇలా అడుగడుగునా రాజ వైభవాన్ని చాటుతోంది.14వ శతాబ్దంలో రేచర్ల వంశాధిపతి ఎర్ర దాచానాయుడు ఈ కోట నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. ఆయన వంశానికి చెందిన మొదటి సింగమ నాయకుడు కోటను పూర్తి చేసినట్లు చరిత్ర చెబుతోంది.

ఏడుకొండల మధ్య చారిత్రక వైభవం..

కాకతీయుల అనంతర కాలంలో రేచర్ల పాలకుల నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఖిల్లా నిలుస్తోంది. 360 బురుజులు.. తొమ్మిది ప్రధాన ద్వారాలు.. 53 దిగుడు బావులు.. ఆరు కొలనులు.. ఇలా శత్రువుల నుంచి రక్షణతోపాటు నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అప్పటి పాలకులు అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. అయితే వీటన్నింటిలో ఈ పురాతన కోనేరు. ఇప్పుడు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎండలు మండుతున్నా.. తరగని జలకళ..

సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు.. చెరువులు, కుంటలు, బావులు నీరు లేక వెలవెలబోతుంటాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రంగా మారడంతో భూగర్భ జలాలపైనా ప్రభావం పడింది. బోర్లు వట్టిపోయి పంట పొలాలు ఎండిపోయాయి. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవరకొండ ఖిల్లాలోని ఈ కోనేరు మాత్రం ప్రకృతి ప్రతికూల పరిస్థితులకు అతీతంగా కనిపిస్తోంది. చుట్టూ ఎండిపోయిన వాతావరణం.. మండుతున్న ఎండలు.. అయినా కోనేరులో మాత్రం నీరు తగ్గకుండా అందరిని విస్మయానికి గురిచేస్తోంది. వర్షాలు కురిసినా.. కురవకపోయినా.. ఈ కోనేరు మాత్రం నిండుగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

కొబ్బరి నీళ్లలా స్వచ్ఛత.. భక్తుల్లో ప్రత్యేక నమ్మకం..

ఈ కోనేరు వెనుక ఏదో సహజ జల రహస్యం దాగి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. కొండ ప్రాంతంలోని భౌగోళిక స్వరూపం.. రాతి పొరల మధ్య నుంచి వచ్చే సహజ నీటి ఊటలు.. భూగర్భ జలాల ప్రవాహం.. ఇవే కోనేరులో నీరు నిల్వ ఉండటానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ కోనేరు నీరు కొబ్బరి నీళ్లను తలపించేలా స్వచ్ఛంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. మహాశివరాత్రి, ఏకాదశి వంటి పర్వదినాల్లో కొందరు భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్న నమ్మకమూ స్థానికుల్లో ఉంది.

చారిత్రక కోనేరును అభివృద్ధి చేయాలి..

ఒకప్పుడు రాజుల దాహార్తిని తీర్చిన ఈ కోనేరు.. వందల ఏళ్ల తర్వాత కూడా నీటితో కళకళలాడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన కోనేరు సరైన నిర్వహణ లేదు. కోనేరులో గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీటి స్వచ్ఛత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పురాతన కోటకు ఎలాంటి నష్టం కలగకుండా గుర్రపుడెక్కను తొలగించి, కోనేరును పునరుద్ధరించాలని కోరుతున్నారు. శతాబ్దాల క్రితమే నీటి నిల్వకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన అప్పటి పాలకుల దూరదృష్టి ఒకవైపు ఆశ్చర్యపరుస్తుంటే.. ఇప్పటికీ నీటితో కళకళలాడుతున్న ఈ కోనేరు మరోవైపు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Follow Us