liquor tenders: గతంలో వేల సంఖ్యలో అప్లికేషన్లు.. ఇప్పుడు వందలు దాటని పరిస్థితి

తెలంగాణలో మద్యం టెండర్లకు ఈసారి చల్లని స్పందన లభిస్తోంది. గతంలో వేల సంఖ్యలో అప్లికేషన్లు రాగా, ఈసారి వందలు దాటని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఫీజులు పెరగడం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రభావం వంటి అంశాల వల్ల వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

liquor tenders: గతంలో వేల సంఖ్యలో అప్లికేషన్లు.. ఇప్పుడు వందలు దాటని పరిస్థితి
Liquor Tenders

Updated on: Oct 12, 2025 | 2:39 PM

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. గతంలో వేల సంఖ్యలో అప్లికేషన్లు రాగా.. ఇప్పుడు వందలు కూడా దాటని పరిస్థితి.  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2023లో 8 వేల 128 అప్లికేషన్లు రాగా.. ఈసారి ఇప్పటివరకు వచ్చింది 278 అప్లికేషన్స్ మాత్రమే. వనపర్తి జిల్లాలో 36 దుకాణాలకు 20 మంది మాత్రమే టెండర్ వేశారు. 25 దుకాణాలకు ఒక్కటంటే ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 287 షాపులకు గాను 315 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది ఇదే జిల్లాలో 10 వేల 734 మంది టెండర్ వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్ షాపులకు ఇప్పటివరకు 411 దరఖాస్తులు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

మద్యం షాపులకు ఈ నెల 30తో గడువు ముగియనుండడంతో గత నెల 25న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 18వరకు టెండర్లకు గడువు. ఈ నెల 23న మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. అంటే.. టెండర్లకు కేవలం ఐదు రోజులే సమయం ఉంది. అయినప్పటికీ వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

టెండర్లకు ఇంకా ఐదు రోజులే గడువు మిగిలి ఉండడంతో టెండర్ల సంఖ్య పెంచేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మంచి రోజు, తిథిల పేరుతో ఎక్సైజ్ సిబ్బంది వాట్సప్ స్టేటస్‌లు పెడుతున్నారు. గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్లు చేసి టెండర్ల గురించి చెప్తున్నారు.

లిక్కర్ టెండర్లకు ఆసక్తి చూపకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెండర్ ఫీజు గతంలో రెండు లక్షలు ఉండేది. ఇప్పుడు మూడు లక్షలకు పెంచడం ఒక కారణమైతే.. మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయడం మరో కారణం. ఇప్పుడు ఎన్నికలు పెండింగ్‌లో పడ్డాయి. కోడ్ తొలగిపోయింది. దీంతో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.